రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందేలా నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలు, విద్యాశాఖ అధికారులతో గవర్నర్ చాన్సలర్ హోదాలో తొలిసారి సమావేశమయ్యారు. పూర్తిస్థాయి వీసీల నియామకం, ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు, బోధన, బోధనేతర ఖాళీలు, విద్యార్థులకు సదుపాయాలు, తదితర అంశాలపై సుమారుగా 3 గంటలపాటు చర్చించినట్లు సమాచారం. సమావేశానికి ఉన్నత విద్యా మండలి అధికారులు, తొమ్మిది యూనివర్సిటీల ఇన్ఛార్జి వీసీలు హాజరయ్యారు.
విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు పాపిరెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీలను మంచి వాతావరణంలో తీసుకువెళ్లాలని గవర్నర్ తెలిపినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ చెప్పారు.