రోగనిరోధక శక్తిని మానవ శరీరంలో వృద్ధి చేసే వంగడాలు పరిశోధనల ద్వారా అభివద్ధి చేసి.. అలాంటి పంటలు పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ రంగ పరిశోధకులకు గవర్నర్ తమిళిసై సూచించారు. ఇప్పటి తరం అన్నంతో మధుమేహం వస్తుందని రైస్‌కు దూరంగా ఉంటున్నారని తెలిపారు. వరి వంగడాలను శాస్త్రీయంగా పరిశోధించి వాటిలో చక్కర శాతం తగ్గించడానికి ప్రయత్నించాలని గవర్నర్ కోరారు.
రాజ్‌భవన్ నుంచి గవర్నర్... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన తెలంగాణ సోన అనే ప్రత్యేక వరి రకాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతను కూడా అన్నానికి దగ్గర చేయవచ్చని... ఆ రకంగా దక్షిణ భారతదేశ సంప్రదాయం కూడా కాపాడుకోవచ్చని గవర్నర్ వివరించారు.
నీరా ఎంతో పోషకాహార విలువలు కలిగిందని గవర్నర్ తెలిపారు. ఈ పానీయం ఎక్కువ కాలం పోషక విలువలు పోకుండా నిలువ ఉంచే విధంగా పరిశోధనలు జరగాలని సూచించారు. తాటి చెట్టు ద్వారా వివిధ ఉత్పత్తులు తయారు చేసే కుటీర పరిశ్రమలు తమిళనాడు, కేరళలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వివరించారు. తాటిచెట్టు తమిళనాడు రాష్ట్ర అధికారిక చెట్టు అని గవర్నర్ గుర్తు చేశారు.
అనారోగ్యకరమైన కొన్ని వంట నూనెలతోనే అనేక రోగాలు మొదలవుతున్నాయని ఒక డాక్టర్‌గా తన అనుభవంలో గమనించానని స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భంలో ఆరోగ్యకరమైన వంట నూనెల ఉత్పత్తిలో విస్తృత పరిశోధనలు జరగాలని వ్యవసాయ, ఉద్యానవన పరిశోధకులకు సూచించారు. నేటిరోజుల్లో ఆహారపు అలవాట్లలో విపరీత పోకడలు వస్తున్నాయని, వ్యవసాయ శాస్త్రవేత్తలు సరైన ఆహారపు అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం