ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భిక్షాటనకు యత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అఖిలపక్ష నేతలు భిక్షాటన చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే అడ్డుకున్న పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. అనంతరం ఫలక్ నుమా ఠాణాకు తరలించారు. తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి తదితరులు భిక్షాటనలో పాల్గొన్నారు.
పెద్ద దిక్కుగా ఉండాల్సిన ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోనందుకే తాము భిక్షాటనకు పూనుకున్నామని అఖిల పక్షం నేతలు తెలిపారు. విద్యార్థులకు భిక్షాటనతో నిధులు సమకూర్చే ప్రయత్నాన్ని అడ్డుకుని మమ్మల్ని అరెస్ట్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సుమారు 60 మంది అఖిల పక్షం నేతలు, కార్యకర్తలను వారి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తాను పెట్టదు..యాచిస్తే అడ్డుకుని అరెస్టు చేయడంపై నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇవీ చూడండి : పురపోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు...