లాక్‌డౌన్ వేళ చేనేత కార్మికులను వివిధ పథకాలతో ఆదుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్రంలో 31 వేల 284 కుటుంబాలకు ఉచిత బియ్యం, నగదు పంపిణీ చేసినట్లు పేర్కొంది. బతుకమ్మ చీరలు, యునిఫారాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఒక్కొక్కరికి 15 వేల నుంచి 30 వేల వరకు ఆర్థిక సాయం ఇవ్వడం సాధ్యం కాదని సర్కారు వివరించింది. లాక్డౌన్లో చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 15 వేల రూపాయల నుంచి 30 వేల వరకు ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చేనేత కార్మికులను చేయూత, రుణమాఫీ, చేనేత మిత్ర, పావల వడ్డీ, ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన వంటి పథకాల కింద ఆదుకుంటున్నామని పేర్కొంది.
ఇబ్బందులు పడుతున్నారని
లాక్‌డౌన్ కారణంగా చేనేత కార్మికులు ఉత్పత్తులు విక్రయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది భాస్కర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. పేదలకు అందించిన ఉచిత బియ్యం, 1500 రూపాయల నగదు ద్వారా రాష్ట్రంలో 31 వేల 284 కుటుంబాలు లబ్ధి పొందాయని సర్కారు వివరించింది. వీటి ద్వారా 3 లక్షల 75 వేల కిలోల బియ్యం, 4 కోట్ల 69 లక్షల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపింది. లాక్‌డౌన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేతన్నకు చేయూత పథకం కింద పొదుపు చేసుకున్న మొత్తాన్ని తీసుకునేందుకు అనుమతించామన్నారు. దానిద్వారా 92 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు పేర్కొంది.
ఆదుకునేందుకు వారి నుంచి
నేత కార్మికులను ఆదుకునేందుకు వారి నుంచి యునిఫాంలు, బతుకమ్మ చీరలు కొనుగోలు చేయడం ప్రభుత్వ విధానమని వివరించింది. రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం.. సొసైటీలన్నింటినీ సమన్వయం చేస్తూ ఉత్పత్తులను మార్కెట్ చేస్తోందన్నారు. మే 27 నుంచి లాక్డౌన్ను పాక్షికంగా సడలించిన తర్వాత 10 కోట్ల రూపాయల ఉత్పత్తులను సేకరించినట్లు వివరించింది. మిగతా పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూర్చినట్లు పేర్కొంది. కాబట్టి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 15 వేల నుంచి 30 వేల రూపాయలు ఇవ్వలేమని తెలిపింది.
ఇదీ చూడండి : తెలంగాణలో కొత్తగా 253 మందికి కరోనా... 4,737కు చేరిన కేసులు