VC Appointments in Telangana Universities: వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలపై సర్కారు అవలంభిస్తున్న ధోరణిపై వీసీలు అసంతృప్తిగా ఉన్నారు. ఫలితంగా విద్యార్థులు తమకు పాఠాలు చెప్పేవారెవరని వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కోర్సులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో ఇప్పటికే అనుమతి కోసం పంపిన వర్సిటీ అధికారులు విద్యాశాఖ ఎప్పుడు అనుమతి ఇస్తుందా అని ఎదురుచూస్తుంటే... మరికొందరు పంపించినా అనుమతి వస్తుందో? లేదో? అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
రెండు నెలలవుతున్నా..
Telangana VCs : విశ్వవిద్యాలయాల్లో మూడు రకాల బోధనా సిబ్బంది పనిచేస్తున్నారు. వారు రెగ్యులర్, కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకులు. విద్యార్థులకు పాఠాలు చెప్పే వారిలో 90 శాతం కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకులే. వారు లేకుంటే కొన్ని కోర్సులు నడిపే పరిస్థితి లేదు. పాలమూరు విశ్వవిద్యాలయం సెప్టెంబరు మధ్యలో 41 మంది అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నియామకాల చివరి దశలో తమ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఏ ఒక్క నియామకం జరపరాదని విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా సెప్టెంబరు నెలాఖరులో అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆ వర్సిటీలో నియామకాలు నిలిచిపోయాయి. వాస్తవానికి అక్కడి అధికారులు వర్సిటీ పాలకమండలి ఆమోదం తీసుకున్నా విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో అనుమతి కోసం దస్త్రాన్ని పంపారు. దాదాపు రెండు నెలలవుతున్నా ఇప్పటికీ అనుమతి దక్కలేదు. వచ్చే కొత్త విద్యా సంవత్సరానికే కాకుండా ఇప్పటికే నడుస్తున్న సెమిస్టర్‌లో కూడా అధ్యాపకులు అవసరమని ఆ వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూడా పార్ట్‌టైమ్ అధ్యాపకులు దాదాపు 18 మంది వరకు అవసరమని తెలిసింది. నియామక అనుమతికి ఎన్నాళ్లు పడుతుందోనన్న అనుమానం వర్సిటీ అధికారుల్లో నెలకొంది. వాటికి అనుమతి రాకుంటే కొన్ని కోర్సులు ఎత్తేయక తప్పదని సమాచారం. ‘కొన్ని సార్లు అత్యవసరంగా నియమించుకోవాల్సి ఉంటుంది... ప్రభుత్వ అనుమతి అంటే ఆలస్యమై విద్యార్థులు నష్టపోతారు’ అని వీసీ ఒకరు వ్యాఖ్యానించారు. ‘పనిభారం ఆధారంగానే తాత్కాలికంగా నియమించుకుంటున్నాం.. ఒక వర్సిటీలో అవకతవకలు జరిగాయని అన్ని వర్సిటీలకు కలిపి ఆదేశాలు ఇవ్వడం సమంజసం కాదు’ అని మరో ఉపకులపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి తప్పనిసరి కాకుండా...స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుండేదని వర్సిటీ రిజిస్ట్రార్ ఒకరు అభిప్రాయపడ్డారు.
ఆర్థికశాఖ అనుమతీ తప్పదా?
పార్ట్ టైమ్ అధ్యాపక పోస్టుల భర్తీకి విద్యాశాఖ అనుమతి ఇవ్వాలంటే... ఆర్థికశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిసింది. అనుమతి లేకుండా ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయరాదని ఆర్థిక శాఖ కొద్ది నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలంటే ఇప్పట్లో కష్టమేనని భావిస్తున్నారు. ఇదే సమస్యపై కొంత మంది ఉపకులపతులు మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.
ఇదీ చూడండి: TS Universities Issues: పీహెచ్‌డీ ప్రవేశాల్లో రగడ.. సిబ్బంది నియామకాలపై ఆందోళనలు