Government on discoms debts విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల బకాయిలు తీర్చడానికి రూ.10 వేల కోట్ల రుణాలకు పూచీకత్తు(కౌంటర్ గ్యారంటీ) ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. బకాయిలను నెలవారీ వాయిదాల పద్ధతిలో తీర్చేందుకు కేంద్రం ఇటీవల అనుమతించింది. దీని ప్రకారం డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించేందుకు.. గ్రామీణ విద్యుద్ధీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) లేదా విద్యుత్ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ) రుణం ఇస్తాయి. ఇందుకోసం కేంద్రం షరతు మేరకు పూచీకత్తు ఇస్తూ రాష్ట్ర ఇంధనశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఆ రుణాన్ని డిస్కంలు రెండేళ్ల తర్వాత నుంచి నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుతో పాత బకాయిల భారం చాలావరకూ తీరిపోయిందని, ఇకనుంచి కరెంటు కొనుగోళ్లకు నిధుల అవసరం ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి.
మెరిట్ ఆధారంగానే ఉద్యోగుల పదోన్నతులు: విద్యుత్ సంస్థల్లో నేరుగా నియామకం విధానంలో ఉద్యోగాల్లో చేరినవారికి.. వారు ఎంపిక పరీక్షలో పొందిన ర్యాంకు మెరిట్ ఆధారంగా పదోన్నతి ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ శనివారం ఉత్తర్వు జారీచేసింది. ఇంతకాలం ఈ పదోన్నతులపై ఉద్యోగుల మధ్య వివాదం నెలకొంది. రోస్టర్ పాయింట్ల ఆధారంగా పదోన్నతి ఇవ్వాలని కొందరు ఉద్యోగులు పట్టుబడుతున్నారు. దీనిపై ట్రాన్స్‌కో గత జూన్ 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఉద్యోగం పరీక్షలో ర్యాంకు మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకుని పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీంతో పదోన్నతులకు అవరోధం తొలగిపోయింది.
ఇవీ చదవండి: JP Nadda meet hero Nitin జేపీ నడ్డాతో టాలీవుడ్ హీరో నితిన్ భేటీ
సోనాలీ ఫోగాట్‌కు ఇచ్చిన డ్రగ్స్ అవే, లైవ్ సీసీటీవీ ఫుటేజీ లభ్యం