General Transfers in TS: రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం కింద జిల్లా, జోన్లు, బహుళజోన్లలో ఉద్యోగుల బదలాయింపుల దృష్ట్యా ఈ ఏడాది సాధారణ బదిలీలు (జనరల్ ట్రాన్స్‌ఫర్స్) చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల అన్ని శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో ప్రభుత్వం ఈ సంకేతాలను ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో చివరిసారిగా 2018లో ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ఏటా కోరుతున్నాయి.
సీనియారిటీ ఇచ్చే అవకాశం..
ఈ ఏడాది జరుగుతాయని ఆశించారు. అయితే కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో ప్రభుత్వం వాటికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు, బదలాయింపులను చేపట్టింది. నెలరోజుల వ్యవధిలో దాదాపు 70 వేల మందికి బదిలీలు చేశారు. ఈ ప్రక్రియలో ఇంకా భార్యాభర్తలైన ఉద్యోగులకు సంబంధించిన వినతులతో పాటు ఇతరత్రా అంశాలను పరిష్కరించాల్సి ఉంది. దీంతోపాటు ఇప్పటికే బదిలీ అయిన వారికి సంబంధించిన సీనియారిటీని ఖరారు చేయాలి. జిల్లా స్థాయుల్లో సమస్య లేకున్నా జోనల్, బహుళజోనల్ పోస్టుల్లోకి బదిలీ అయిన వారికి, భార్యాభర్తలకు సంబంధించి సీనియారిటీపై స్పష్టత రావాలి. వారిని ఒకే చోట నియమిస్తే.. అప్పటికే అక్కడున్నవారి తర్వాత సీనియారిటీని ఇచ్చే వీలుంది. దీనిపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అలా చేస్తే మళ్లీ మొదటికే వస్తుంది..
ఈ సందడిలోనే తమకు పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనికి అనుమతిస్తే మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరికొన్ని రోజులు అవసరం. మరోవైపు ఉద్యోగుల బదలాయింపులు పూర్తి అయ్యాక... వాటి ప్రాతిపదికన ఖాళీలను గుర్తించి, నోటిఫికేషన్లు ఇచ్చి, నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని గురించి అన్ని శాఖల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఈ వివరాలు రాగానే... ఖాళీల ప్రాతిపదికనే కొత్త ఉద్యోగ నియామకాలు జరిగే వీలుంది. అలా గాకుండా సాధారణ బదిలీలు చేపడితే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది.
పరిస్థితి గందరగోళమవుతుంది..
సాధారణంగా విద్యాసంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్, మే మాసాల్లో సాధారణ బదిలీలు జరుగుతుంటాయి. అన్ని శాఖల్లో, అన్ని స్థాయుల్లో ఇవి జరుగుతుంటాయి. ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఐచ్ఛికాలు, కౌన్సెలింగు, కొత్త పోస్టుల్లో చేరడం తదితరాలకు నెల నుంచి రెండు నెలల గడువు అవసరం. రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన జోనల్ విధానంలో బదిలీ అయి కొత్త పోస్టింగుల్లో చేరుతున్నారు. వెంటనే మళ్లీ సాధారణ బదిలీలు చేపడితే.. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటే గందరగోళంగా మారుతుందని, పాలనపైనా ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా వాటిని ఈ ఏడాది చేపట్టరాదని అనుకుంటున్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి: Dharani Portal Modules: ధరణి పోర్టల్ మాడ్యూళ్ల కోసం రైతుల ఎదురుచూపులు