కరోనా మహమ్మారికి ఇకపై ప్రైవేటులోనూ పూర్తి స్థాయిలో టెస్టులు, చికిత్సలను అందించవచ్చని సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన విడుదల చేయగా.. తాజాగా మంత్రి ఈటల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కరోనా టెస్టులు, చికిత్సలకు ధరలను నిర్ణయించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా టెస్టులకు తక్కువ మొత్తంలో ఫీజులు నిర్ణయించామన్నారు. మహారాష్ట్రలో రూ. 2250కి పరీక్షలు నిర్వహిస్తుండగా.... రాష్ట్రంలో కేవలం రూ.2200 పరీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు. ఫలితంగా పేద ప్రజలపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
చికిత్స ఫీజులపై నిర్ణయం
మరోవైపు కరోనా చికిత్సలకు సంబంధించిన ఫీజులపై కూడా సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటులో చికిత్సలను అనుమతించాలని గత కొంత కాలంగా వినతులు వెల్లువెత్తిన నేపథ్యంలో పేదలపై భారం పడకుండా నిర్ణయం తీసుకున్నామన్న ఈటల.. వైరస్ సోకి సాధారణ ఐసోలేషన్‌లో ఉన్నవారికి రూ.4000 ఫీజు, ఐసీయూ గదిలో చికిత్స పొందుతున్న వారి నుంచి రూ.7500, వెంటిలేటర్‌పై ఉన్న వారి నుంచి రోజుకు రూ.9000 వేలకు మించి వసూలు చేయరాదని స్పష్టం చేసింది.
అనవసరంగా ఆస్పత్రుల్లో ఉంచితే చర్యలు
కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ లక్షణాలు లేకపోయినా అనవసరంగా ఆస్పత్రుల్లో ఉంచి చికిత్సలు అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొవిడ్‌తో ప్రైవేట్‌లో చికిత్స పొందుతున్న వారు ఫీజుల విషయంలో ఎక్కువగా ఛార్జి చేస్తున్నారనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ప్రైవేటులో చికిత్స పొందాలని ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి ఇచ్చామన్న ఈటల... ప్రభుత్వం కరోనా చికిత్సల విషయంలో ఏ మాత్రం నాణ్యతా లోపాలు లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా మహమ్మారి చికిత్సలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.