Water Conservation Awards-2021 : స్వరాష్ట్ర సాధన తర్వాత ఏడేళ్లల్లో జరిగిన నీటి సంరక్షణ కార్యక్రమాలు గుర్తించి ప్రోత్సహించేందుకు సర్కారు సిద్ధమైంది. తెలంగాణ నీటి సంరక్షణ పురస్కారాలు-2021 ఇవ్వాలని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి వర్షపు చుక్క ఒడిసి పట్టుకుంటూ... వృధా చేయకుండా సంరక్షిస్తున్న వారిని ప్రోత్సహించాలని భావిస్తోంది.
నీటి సంరక్షణ వినూత్న పద్ధతులు...
- వర్షపు నీటి సంరక్షణ
- కృత్రిమ రీఛార్జి ద్వారా భూగర్భ జలాలు పెంచడం
- వర్షపు నీటి సంరక్షణ పెంపొందించడం
- మురుగు లేదా కలుషిత నీటి పునర్వినియోగం
- రీసైక్లింగ్ ట్రీట్‌మెంట్
- చెరువులు, కాలువల పునరుద్ధరణ
పై కార్యక్రమాల కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, రైతులు, సంస్థలను ప్రొత్సహించాలన్నది లక్ష్యం. క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణ కోసం ప్రజలను చైతన్యవంతం చేయడం, సమీకరించే ఉద్యమాలు తదితర రంగాల్లో కృషి చేసిన సంస్థలు, వ్యక్తులు ఈ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నీటి సంరక్షణ పురస్కారాల్లో...
- ఉత్తమ ప్రభుత్వ సంస్థ
- ఉత్తమ ప్రైవేటు సంస్థ
- ఉత్తమ పాఠశాల
- ఉత్తమ బహుళ అంతస్తుల భవనం
- ఉత్తమ కాలనీలు
- ఉత్తమ గేటెడ్ కమ్యూనిటీ
- ఉత్తమ వ్యక్తులు
- ఉత్తమ స్వచ్ఛంద సంస్థలు
- ఉత్తమ నిపుణులు
- చెరువులు-కాలువల పునరుద్ధరణ
- ఉత్తమ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా
- ఉత్తమ పరిశ్రమ
- ఉత్తమ కార్పొరేట్
సామాజిక బాధ్యత - సీఆర్‌ఎస్ కింద 11 కేటగిరీల్లో ఈ పురస్కారాలు అందజేస్తారు. నీటి సంరక్షణ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలు కార్యక్రమాల పూర్తి వివరాలతో ఈ నెల 15వ తేదీలోగా hyderabadwaterawards@gmail.comకు మెయిల్ చేయాలని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ నీటి సంరక్షణ పురస్కారాల కమిటీ ఛైర్మన్ వి.ప్రకాష్ అన్నారు. https://tswalamtari.weebly.com వెబ్‌సైట్ నుంచి స్వీకరించిన దరఖాస్తును రాసి పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: TS High court :'డబుల్' ఇళ్ల కేటాయింపులో వాళ్లకు కూడా కేటాయించండి