తెలంగాణ లైఫ్ సైన్సెస్ నూతన అడ్వైజరీ కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల పదవీకాలం ఉండే ఈ కమిటీకి డాక్టర్ రెడ్డీస్ లాబోరెటరీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి ఛైర్మన్ గా, బయెలాజికల్ ఈ- లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల వైస్ ఛైర్మన్ గా కొనసాగనున్నారు. కమిటీకి ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ విభాగ డైరెక్టర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. 2016 లో ఏర్పడిన ఈ కమిటీ ప్రభుత్వానికి, లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు సంధానకర్తగా వ్యవహరిస్తుంది.
ఈ నూతన లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి కేటీఆర్.. లైఫ్ సైన్సెస్ విభాగం తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో ఒకటని పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో ఈ పరిశ్రమను 50 బిలియన్ డాలర్ల నుంచి వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపుదిద్ది.. 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో కల్పించటమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడించేలా కార్యక్రమాల రూపకల్పనకు, ప్రభుత్వ భాగస్వామ్యానికి ఈ కమిటీ మరింత పాటుపడాలని కేటీఆర్ ఆకాంక్షించారు.