హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు భారీవర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు జీహెచ్ఎంసీ ఇప్పటికే సిబ్బందిని పంపించింది. అత్యవసర సహాయ బృందాల సహాయక చర్యలు చేపట్టింది. రహదారులపై నీటి నిల్వలను తొలగించేలా చర్యలు తీసుకుంది.
వాగులు, కాల్వలు దాటే ప్రయత్నం చేయొద్దు..
లోతట్టు ప్రాంతాలు, చెరువు పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శిథిలావస్థ ఇళ్లలో ఉన్నవారు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. వర్షాల దృష్ట్యా రంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్న మంత్రి.. ఏవైనా ఇబ్బందులుంటే సంప్రదించాలన్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని.. ఎవరూ వాగులు, కాల్వలు దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
అప్రమత్తంగా విధులు చేపట్టాలి..
భారీ వర్షాల నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్‌శాఖను అప్రమత్తం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో సమీక్ష నిర్వహించిన ఆయన.. వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అన్ని స్థాయిల్లోని పోలీసులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. జీహెచ్ఎంసీతో పాటు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల సమన్వయంతో.. పనిచేయాలని పోలీసులకు సూచించారు.
విద్యుత్ స్తంభాలతో జాగ్రత్త..
వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ వెల్లడించింది. విద్యుత్ అధికారులతో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీలో వరదల దృష్ట్యా.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే.. కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: వరదతో ట్రాఫిక్ జామ్.. ఈత కొట్టుకుంటూ వెళ్లిన వ్యక్తి..