Google Street View: హైదరాబాద్ డీడీ కాలనీలోని బంధువుల ఇంటికి నల్గొండ జిల్లా చిట్యాల నుంచి సురేష్ బయలు దేరారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తరువాత చిరునామా కనుక్కోవడం చాలా ఇబ్బందిగా మారింది. గూగుల్ మ్యాప్ ఉన్నప్పటికీ వీధులు.. అందులోని ఇంటిని గుర్తించడం కష్టమైంది. మ్యాప్‌లపై ఆధారపడి ఎన్నో సేవలు అందించే వారికి, మహానగరంలో చిరునామాలు అన్వేషించే వారికి ఇకపై ఇలాంటి కష్టాలుండవు. వీటికి గూగుల్ సాంకేతిక పరిష్కారం చూపింది. రెండు రోజుల కిందట అందుబాటులోకి వచ్చిన గూగుల్ స్ట్రీట్‌వ్యూలో రహదారితోపాటు అక్కడున్న ఇళ్లు.. చిన్నచిన్న వీధులు.. 360 డిగ్రీల కోణంలో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించడంతో గూగుల్ స్ట్రీట్‌వ్యూ అందుబాటులోకి వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో ఈ సేవలను గూగుల్ అందుబాటులోకి తీసుకురావడంతో ఇక్కడి పలు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను ఎవరైనా చూసేందుకు వీలు కలిగింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు లోపలి కాలనీలు, వీధులు, ప్రధాన మార్గాల వెంబడి నిర్మాణాలన్నీ స్ట్రీట్‌వ్యూలో నిక్షిప్తమయ్యాయి. పాతబస్తీలోని చిన్నచిన్న గల్లీలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవీ ఉపయోగాలు...
* రోడ్డు విస్తీర్ణం ఎంత? ఎక్కడెక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు.
* ఏదైనా వీధిలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడికి కార్లు, ఆటోలు వెళ్లే మార్గం ఉందో లేదో ముందుగానే చూసుకోవచ్చు.
* ఇతర ప్రాంతాల వారు ఇక్కడి ప్రదేశాలను స్ట్రీట్‌వ్యూలో చూసి, ఇక్కడ పర్యటించిన అనుభూతి పొందవచ్చు.
* ఇళ్లు అద్దెకు తీసుకునే వ్యక్తులు, స్థిరాస్తి కొనుగోలుదారులు ఆ ప్రాంత ముఖచిత్రాన్ని ముందుగానే చూసి అంచనా వేసుకోవచ్చు.
* విదేశాలు, ఇతర ప్రాంతాల్లోని యజమానులు తమ ఆస్తుల పరిస్థితిని స్ట్రీట్‌వ్యూ మ్యాప్ అప్‌డేట్ అయినప్పుడల్లా చూసుకునేందుకు వీలుంటుంది.