ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మాటలకు సరైన అర్థాన్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పేర్నమిట్ట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. పుస్తకాలకే విద్యార్థులు పరిమితం కాకుండా ...వారికి నైతిక విలువలు, మానవ సంబంధాలపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యాలయంలో జూనియర్ రెడ్ క్రాస్ అనే సంస్థను నెలకొల్పిన ఉపాధ్యాయులు …వాటి ద్వారా పిల్లల్లో సేవాభావాన్ని అలవరుస్తున్నారు.
వృద్ధాశ్రమానికి సరుకుల అందజేత
ఒక్కో విద్యార్థి రోజుకో రూపాయి చొప్పున ...ఓ నిధిని పొగుచేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. దీనికి కొంత జోడించి....అంతా కలిసి ఓ వృద్ధాశ్రమానికి నెలకు సరిపడా సరకులు అందించారు. అక్కడి వారితో మమేకమై...వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఆప్యాయతకు దూరమై బతుకు భారంగా వెళ్లదీస్తున్న వృద్ధులు …పిల్లలను సొంత మనవళ్లు, మనవరాళ్లలా భావించి ముద్దాడారు. పెద్దమనసుతో సాయం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆశీర్వదించారు.
వృద్ధాశ్రమాలు లేని సమాజం కోసం కృషి చేస్తాం
ఆశ్రమంలో వృద్ధుల పరిస్థితి చూసి చలించిన చిన్నారులు....ఎట్టి పరిస్థితుల్లో తమ కుటుంబీకులకు అలాంటి పరిస్థితులు రానివ్వమని అన్నారు. వృద్ధాశ్రమాలు లేని సమాజం కోసం పనిచేస్తామని చెప్పారు.
నైతిక విలువలు పెంచేందుకే వినూత్న కార్యక్రమాలు
సమాజం, కుటుంబ విలువల పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. నైతిక విలువలతో కూడిన విద్యను తమ పిల్లలకు బోధిస్తూ ...ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల కృషిని తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.
ఇవీ చూడండి: రెవెన్యూ మాయ.. చూస్తే దిమ్మదిరిగి పాయె..