Godarolla Kithakithalu: గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ పేజీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన ఈ గ్రూప్ అడ్మిన్ ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఈవీవీ) గురువారం కన్నుమూశారు. రాత్రి 11.30 గంటలకు సమయంలో ఆయన గుండెపోటుతో రాజమహేంద్రవరం బొమ్మూరులోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఈవీవీ గోదారోళ్ల కితకితలు పేజీ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. గోదావరి జిల్లాల యాస, సంస్కృతి, సంప్రదాయాలు నేటితరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్‌ను ఆయన 2015లో ప్రారంభించారు. ఇందులో 2 లక్షలకుపైగా సభ్యులున్నారు.
గోదావరి యాస, భాషకు పట్టం: గ్రూప్ పేరుకు తగినట్లుగానే గోదావరి యాస, భాషలకు గ్రూప్ ద్వారా ఆయన ఎంతో ప్రాచుర్యం కల్పించారు. కోకాకోలా కంపెనీ ఉద్యోగం చేసే ఈవీవీ... ఇటీవల నాగార్జున నటించిన బంగర్రాజు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఈవీవీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం జరిపించారు. ఏటా కార్తికమాసంలో 'గోదారోళ్ల కితకితలు' గ్రూపు సభ్యులు, ఈవీవీ వనసమారాధన జరిపేవారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది గ్రూప్ సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సందడి ఇందులో పాల్గొనేవారు. గోదారోళ్ల కితకితలు గ్రూప్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పలు రికార్డులు కూడా సాధించింది. ఈవీవీ మృతిచెందారన్న వార్త తెలిసి ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
లక్షల మందిని చేరిన గ్రూపు: ఆరోగ్యకరమైన హాస్యానికి జీవం పోస్తూ మంచి రచయితగా ఈవీవీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఓ ప్రమాదంలో స్నేహితుడిని కాపాడి సంచలనంగా మారారు. ప్రాణాన్ని కాపాడిన ఫేస్బుక్ స్నేహం అంటూ అప్పట్లో వార్తా కథనాలు ప్రసారం కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఈవీవీ ఆకర్షించారు. అనంతరం కొద్ది రోజులకే గ్రూప్ లక్షల మందిని చేరుకుని ప్రత్యేకతను ఏర్పరుచుకుంది. గ్రూప్ పెట్టిన దగ్గర నుంచి ఈవీవీ హాస్య కథనాలతో పాటు తన జీవితాన్నే ఆదర్శంగా తీసుకుని.. మధ్య తరగతి ప్రజల స్థితిగతులపై కట్టి పడేసే కథనాలతో తనలోని ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవలే సినిమాల్లో సైతం ప్రవేశించి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆయన గోదారోళ్ల విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
'గోదావరి యాసే నా శ్వాస అని పైకి చెప్పినా... ఆత్మీయత అనుబంధం శ్వాసగా చేసుకొని లక్షలమంది కుటుంబ సభ్యులని ఒక తాటిపై నిలబెట్టి ఐకమత్యమే మహాబలం అని నిరూపించారు. అనుబంధం ఆత్మీయత అందరికి ఉండాలని అందరూ అంటారు వాటి విలువ ఈవీవీ నేర్పించారు. సేవ చేయడానికి ఆర్థిక బలం.. అవసరం లేదు. స్పందించే మనసులని సంధానిస్తే చాలని చెప్పారు. చేయూత ఇవ్వడానికి చేతినిండా డబ్బు అవసరం లేదు.. చేయాలి అనే తలంపు ఉంటే చాలని చెప్పిన వ్యక్తి ఈవీవీ. ఒకరికోసం ఒకరు కనీసం ఒక కుటుంబంలో ఆలోచించలేని ఈ కాలంలో... ఒక సామాన్య గోదావరి బిడ్డ.. జీవితానికి సరిపడా విలువలు నేర్పించారు. ఆయన మన మధ్య లేరంటే వినడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఆ వార్త అబద్ధమైతే బావుండు.' -- ఈవీవీ, అభిమాని
ఇదీ చూడండి : Cyberabad Traffic Police : 'మేం రూల్స్ పెడతాం.. కానీ ఫాలో అవ్వం'