కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం కసరత్తు వేగవంతం చేసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఈనెల 9న అత్యవసరంగా సమావేశం కానుంది. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు కోసం నిన్న సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. పూర్తి స్థాయి బోర్డు భేటీ నిర్వహించాలని కోరిన తెలంగాణ ఈ సమావేశానికి హాజరు కాలేదు.
తెలంగాణ గైర్హాజరీని సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించిన జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే... త్వరలోనే పూర్తి బోర్డును సమావేశపరుస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా ఈనెల 9న బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారాన్ని పంపారు. కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలను అజెండాలో పొందుపరిచారు.
అజెండా అంశాలపై చర్చించేందుకు బోర్డు సభ్యులు అందరూ సంబంధిత డాక్యుమెంట్లతో హాజరు కావాలని జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి కోరారు. 9వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కూడా జీఆర్ఎంబీ భేటీ తర్వాత జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చూడండి: MEETING ON GAZETTE: గెజిట్ నోటిఫికేషన్ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల కీలక నిర్ణయం