హైదరాబాద్లోని సూరారంలో దారుణం జరిగింది. నమ్మి వచ్చిన ఓ యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేసి లగేజీ బ్యాగులో పెట్టి మురికి కాలువలో పడేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. వారం కిందట రామచంద్రపురానికి చెందిన ఓ యువతి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ యువతికి సూరారంలోని ఓ వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా దిగ్భ్రాంతి కలిగించే నిజాలు బయటపెట్టాడు.
తాను తెచ్చుకున్న పెట్టెలోనే
పోలీసుల విచారణలో నిందితుడు యువతిని హత్యచేసినట్లు అంగీకరించాడు. ఆమె తెచ్చుకున్న పెట్టెలోని బట్టలు పడేసి అందులోనే మృతదేహాన్ని పెట్టి సూరారం కాలనీలోని కృషి పాఠశాల పక్కనున్న మురికి కాలువలో పడేసినట్లు వివరించాడు.
క్లూస్ టీం మురికి కాలువలోని లగేజీ బ్యాగ్ తెరిచి చూడగా పాడైపోయిన స్థితిలో మృతదేహం ఉంది. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.