హైదరాబాద్ నగర పరిశుభ్రత కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సాఫ్ హైదరాబాద్- షాన్ దార్ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. దీని ప్రధాన ఉద్దేశం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం. రోడ్లపై చెత్తవేసినా, నీరు వచ్చినా, భవన నిర్మాణ వ్యర్థాలు వేసినా, చెత్తను తగులబెట్టినా, రోడ్లపై ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా జీహెచ్ఎంసీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. గతంలో వీటిని పర్యవేక్షించేందుకు జీహెచ్ఎంసీ నానో కార్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తిప్పేందుకు ప్రణాళిక రూపొందించింది. మొదటగా ప్రయోగాత్మకంగా అమలు చేసి.... కొద్ది రోజులు తిప్పారు. తర్వాత ఇదీ మూన్నాళ్ల ముచ్చటే అన్న చందంగా తయారైంది.
మూన్నాళ్ల ముచ్చటే..
ఇటీవల రోడ్డుపై ఉమ్మివేశాడని ఆర్టీసీ డ్రైవర్‌కు 100 రూపాయలు, ప్రభుత్వ గోడలపై పోస్టర్లు వేసినందుకు గోల్కోండ పోలీసులకు జీహెచ్ఎంసీ పది వేల రూపాయల జరిమానా విధించింది. ఆ తర్వాత కానీ అంతకు ముందు కానీ ఇలా జరిమానాలు విధించింది చాలా అరుదు. నగరంలో పలు హోటల్స్, ఇళ్ల ముందు నీరు, మురుగు నీరు వదిలిపెట్టారని అడపాదడపా జరిమానాలు విధిస్తున్నారే కానీ నగరంపై జీహెచ్ఎంసీ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయడం లేదు.
ఇకనైనా స్పందించరా..!
ఇక పాన్ షాప్‌ల వద్ద ఉమ్మడం, సిగరెట్లు తాగుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతుంటారు. హోటల్స్ వద్ద ఇలాంటి ఇబ్బందులు మరి ఎక్కువ. నగరంలో రోడ్ల పక్కన ...కాలినడకన వెళ్లేందుకు ఫుట్ పాత్‌లు ఏర్పాటు చేశారు. కానీ ఫుట్‌పాత్‌లపై మూత్ర విసర్జన చేస్తూ పాదచారులు నడవలేకుండా చేస్తున్నారు. అసలే ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతుంటే..... ఉన్న వాటిపై ఇలా మూత్ర విసర్జన చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అధ్వాన్నంగా మూత్రశాలలు
మరోవైపు నగరంలో సరైనన్ని మూత్రశాలలు లేవనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధునాతనంగా ఏర్పాటు చేసిన బయో మూత్రశాలలపై ప్రకటనలకోసం డబ్బులు వసూల్ చేస్తున్న.. జీహెచ్ఎంసీ వాటి పర్యవేక్షణను గాలికి వదిలేసింది. ఈ మధ్య మెట్రో స్టేషన్ల దగ్గర ఏర్పాటు చేసిన మూత్ర శాలలు అధ్వాన్నంగా మారాయి. మెట్రో స్టేషన్ల కింద నిలబడేందుకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి నగరంలో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని నగర పౌరులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'వారసత్వ కట్టడాలు, హైదరాబాద్ ఉనికి కాపాడుకుందాం'