గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణను అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో అమలులో ఉన్న ట్రాఫిక్ సిగ్నలింగ్ నిర్వహణను అధ్యయనం చేయాలని జీహెచ్ఎంసీ కార్యాలయంలో నగర ట్రాఫిక్ ఇంప్యాక్ట్ అసెస్మెంట్పై జరిగిన సమావేశంలో నిర్ణయించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సైబరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్‌కుమార్, తదితరులు హాజరయ్యారు. ఈ నవంబర్ మాసాంతానికి నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ కాంట్రాక్టు గడువు బీఈఎల్‌తో ముగుస్తుందని దానకిశోర్ పేర్కొన్నారు.
బెంగళూరు ట్రాఫిక్ సిగ్నళ్లపై అధ్యయనం
ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నలింగ్‌లో గణనీయమైన ప్రగతి సాధించామని తెలిపారు. కొత్తగా మరో 200 ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేయాలని ఆయా పోలీస్ కమిషనరేట్‌ల నుంచి ప్రతిపాదనలు అందాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ సంతృప్తికరంగా లేదని ట్రాఫిక్ పోలీసు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూర్‌లో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణపై అధ్యయనం చేయడానికి జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్‌తో పాటు ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో కూడిన కమిటీని పంపనున్నట్లు దానకిశోర్ వివరించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణను చేపట్టిన బీఈఎల్ ఉన్నతాధికారులతోనూ కమిటీ సమావేశమవుతుందన్నారు.
ఆగస్టులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరంలో గుర్తించిన సమస్యాత్మక ముంపు ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టాలని కమిషనర్ దానకిశోర్ ఆదేశించారు.
ఇవీ చూడండి: తొలిరోజు... వాడివేడిగా ప్రత్యేక అసెంబ్లీ