దోమల నివారణకు రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన జీహెచ్‌ఎంసీ తాజాగా మరో ఎత్తుగడను ప్రయోగించనుంది. చెరువుల్లో చేపలను వదిలి.. దోమల లార్వాలు ఎదగకుండా ఉండేలా ప్రయోగం చేయనుంది. ఈ మేరకు.. హయత్ నగర్లోని కాప్రాయి చెరువులో లక్షలాది గంబూసియా చేపలను పెంచుతున్నారు. వాటిని.. నగరంలోని అన్ని చెరువులు, కుంటల్లో వదిలేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవి రోజుకు 100 నుంచి 300 దోమల లార్వాను ఆహారంగా తీసుకొని దోమల సంతతిని నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తాయి. నగరంలో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు, తగ్గుముఖం పట్టడంలో వీటి పాత్ర ఎనలేనిది. చెరువులు, కుంటలు, జలాశయాల్లో గంబూసియా సంతతి అంతకంతకు పెంచి దోమల సమస్యను అరికడతామని ఎంటామాలజి విభాగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
త్వరలో అన్ని చెరువుల్లో..
రెండేళ్ల క్రితం గంబూసియా చేపలను అధికారులు హయత్‌నగర్‌లోని కాప్రాయి చెరువులో వదిలారు. నీరు పుష్కలంగా, వాటి జీవన పరిస్థితులకు చెరువు అనుకూలంగా ఉండటం వల్ల.. వాటి సంతతి ఊహించని రీతిలో పెరిగింది. ప్రస్తుతం ఆ చెరువులో 50లక్షల చేపలున్నట్లు ఛీఫ్ ఎంటమాలజిస్టు రాంబాబు తెలిపారు. నగరంలోని ఇతర చెరువుల్లోనూ ఇదే తరహాలో చేపలు వృద్ధి చెందాయన్నారు. ఆయా చెరువుల నుంచి గంబూసియా చేపలను సేకరించి కొరత ఉన్న జలవనరుల్లో వదులుతామంటున్నారు. ప్రస్తుతం ఎంటామలజి సిబ్బంది ఆస్తుల సర్వేలో నిమగ్నమై ఉన్నారని, సర్వే ముగిశాక చేప పిల్లల సేకరణ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. 1908 నుంచే దోమల నివారణకు గంబూసియా చేపలు వినియోగించినట్టు ఆయన తెలిపారు.
వాతావరణాన్ని తట్టుకుంటాయి..
ఉష్ణోగ్రతలో మార్పులు, నీటి కాలుష్యాన్ని తట్టుకొని జీవించే శక్తిని అంచనా వేసి.. ఈ చేపలు గుడ్లు పెడుతాయి. దోమల లార్వా, తవుడు ఇతర పదార్థాలు వీటికి ఆహారంగా వేస్తారు. సంవత్సరం పొడవునా ఈ చేపలు గుడ్లు పెట్టి.. పిల్లలు కంటాయి. ఒక ఈతలో 25 నుంచి 100 పిల్లలను.. కొన్నిసార్లు.. 100-12000 పిల్లలను కంటాయి. గరిష్ఠంగా సాధారణ చేప పొడవు 4.5 సెం.మీ ఉంటుంది. కానీ.. గంబూసియా రకంలో ఆడ చేప పొడవు 5.2 మీ నుంచి 6.8 సెం.మీ ఉంటుంది. వీటి జీవితకాలం ఏడాదిన్నర. రోజుకు 100 నుంచి 300 వరకు దోమల లార్వాను తినేస్తాయి. గ్రేటర్ పరిధిలోని 70 చెరువులు, 24 కోనేరుల్లో ఈ చేపలను వదిలేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేస్తోంది.
ఇవీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంపై మంత్రుల సమావేశం