హైదరాబాద్ షేక్‌పేట ఓయూ కాలనీ వద్ద పూడికతీత పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు తనిఖీ చేశారు. ముంపు సమస్యను అధిగమించేందుకు జరుగుతున్న పూడిక తీతను ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని 1295 కిలోమీటర్ల నాలాల్లో 390 కిలోమీటర్లు పొడవులో 54 ప్రధాన నాలాలు తెరిచి ఉన్నాయని తెలిపారు.
నాలాల్లో పూడిక తగ్గింది...
గత రెండు, మూడు ఏళ్లుగా తీసుకున్న చర్యల వల్ల నాలాల్లో కొంత పూడిక తగ్గినట్లు వివరించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల విస్తరణ, లింక్ రోడ్లు, స్లిప్ రోడ్ల నిర్మాణంతో పాటు, కూడళ్ల సుందరీకరణ పనులు చేపట్టామన్నారు.
ఇరుకుగా ఉన్న చోట విస్తరణ...
పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, జోనల్ కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నారని ప్రకటించారు. ఇరుకుగా ఉన్న చోట 16 కిమీ వరకు నాలాల విస్తరణ చేస్తున్నట్లు చెప్పారు. 75 శాతం నాలాల విస్తరణ పనులు పూర్తైనట్లు మేయర్ పేర్కొన్నారు. పర్యటనలో కార్పొరేటర్ సాయిబాబా, జోనల్ కమీషనర్ రవికిరణ్, డిప్యూటీ కమీషనర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.