మహిళల భద్రతే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్లుగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న సురక్షిత నగరం కార్యక్రమానికి(సేఫ్ సిటీ ప్రాజెక్టు) బూజు దులిపింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగర వ్యాప్తంగా షీ టాయిలెట్లు, సంచార మరుగుదొడ్లు, శిశువులకు పాలిచ్చే కేంద్రాలు, రహదారులపై పెలికాన్ సిగ్నళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. జోన్లు, సర్కిళ్ల వారీగా టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉంది. మున్ముందు పోలీసుశాఖతో కలిసి సీసీ కెమెరాలు, నిఘా, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తిచేస్తామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.
బస్సుల్లో పాలిచ్చే కేంద్రాలు
గ్రేటర్ పరిధిలో 6 జోన్లున్నాయి. ఒక్కో జోన్‌కు 2 చొప్పున 12 సంచార మరుగుదొడ్లను కొనుగోలు చేయాలని జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం ఇటీవల జోనల్ కమిషనర్లను ఆదేశించింది. అందులో భాగంగా జెడ్సీలు బస్సులను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించారు. కొత్త బస్సులను కొని వాటిలో మరుగుదొడ్లతో పాటు, శిశువులకు పాలిచ్చే గదిని సైతం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సంచార మరుగుదొడ్లను రద్దీ ప్రాంతాల్లో, అవసరమున్న కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. అదనంగా మరో 70 షీ టాయిలెట్లను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. పలు సర్కిళ్లలో నిర్మాణ ప్రక్రియ మొదలైందని, 50 శాతం పనులు పూర్తయ్యాయని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు.
కూడళ్లలో పెలికాన్ సిగ్నళ్లు
రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా గ్రేటర్‌లోని 98 కూడళ్లలో పెలికాన్ సిగ్నళ్లను ఏర్పాటు చేసేందుకు బల్దియా సిద్ధమైంది. టెండర్ల ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. సాఫీగా ఉండే రోడ్లపై పాదచారులు రోడ్డు దాటుకునేందుకు అనువుగా జీబ్రా క్రాసింగుల వద్ద వాటిని ఏర్పాటుచేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇవి కొత్త తరం సాంకేతికతతో పనిచేస్తాయని, సన్నని శబ్దం చేస్తూ.. వాహనాలు ఆగిపోయేలా ఎర్ర లైటు వెలుగుతుందని, పాదచారులు రోడ్డు దాటగానే వాహనాలు సాగిపోయేందుకు సెన్సార్లు పచ్చలైటును వెలిగిస్తాయని అధికారులు వివరించారు.
కేంద్ర నిధులు..
మూడేళ్ల కిందట కేంద్రం సేఫ్ సిటీ ప్రాజెక్టును ప్రకటించింది. నగరాల్లో పౌరుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేసేందుకు నిధులు అందిస్తామని స్పష్టం చేసింది. ఆ మేరకు నగర పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పలుమార్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వేర్వేరు కారణాలతో ఇటీవలి వరకు ప్రాజెక్టులో ఎలాంటి కదలిక లేదు. అయోమయానికి తెర దించి జీహెచ్‌ఎంసీ అభివృద్ధి పనులను పట్టాలెక్కించింది. ఇవి పూర్తయ్యాక ఖర్చు చేసిన బిల్లుల వివరాలను కేంద్రానికి పంపిస్తామని, వాటిని పరిశీలించి నిధులను కేంద్రం తిరిగి చెల్లిస్తుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు-ఈటీవీ భారత్’తో తెలిపారు.