ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లకు టీకా కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 881 టీకా కేంద్రాల ద్వారా వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా ప్రతి రోజు దాదాపు 2 లక్షల టీకా డోసులు అందిస్తున్నారు. ఇదే వేగం కొనసాగితే... ఇంకొన్ని నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 60 వాక్సిన్ కేంద్రాలకు అదనంగా మరో 40 కేంద్రాలను పెంచినట్లు వెల్లడించారు. వీటితో కలిపి ఇప్పటి వరకు నగర పరిధిలో ఉన్న కేంద్రాల సంఖ్య 100 కు చేరిందని అన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి టీకాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలన్నారు.
నగరంలో మంగళవారం 48 వేల 091 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 9 లక్షల 34 వేల 852 మందికి టీకాలు అందించామని వివరించారు. ప్రస్తుతం కేవలం 0.13 శాతం టీకాలు మాత్రమే వృథా అవుతున్నట్లు తెలిపారు. ఇక ప్రైవేటులో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు పది లక్షల డోసులు అందించినట్టు ఇటీవల వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి: Vaccination: 24 గంటల్లో రాష్ట్రంలో 1,82,523మందికి టీకాలు