గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్ను. బల్దియాకు వచ్చే పన్నుల్లో నిర్మాణ అనుమతి పన్ను, ప్రకటనల పన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్నులు ఉన్నప్పటికీ ఆస్తి పన్ను రాబడి అత్యధికంగా ఉంటుంది. ఈ ఆర్థిక ఏడాదిలో 1800 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూళ్లను జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం సాధించేందుకు అవకాశం ఉన్న అన్ని కార్యక్రమాలను బల్దియా అమలు చేస్తుంది. ఈ ఆర్థిక ఏడాది ఆరంబంలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా ఆస్తి పన్ను చెల్లిస్తే పన్నులో 5 శాతం తగ్గించే పథకం తీసుకోచ్చారు. ఎర్లీబర్డ్ పథకం కింద ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 570 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. తర్వాత కరోనా తీవ్రత పెరగడం వల్ల జూన్, జులై నెలల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందగించాయి.
బకాలయిలపై ప్రభుత్వం దృష్టి
పన్ను వసూళ్ల కోసం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బకాయిలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాటిని రాబట్టేందుకు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో, నగరపాలక సంస్థల్లో పాత ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీ బకాయిపై 90 శాతం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో చాలామంది చెల్లింపుదారులకు ఉపశమనం కలుగనుంది. ఏళ్లుగా పెండింగ్ ఉన్న యాజమానులు పన్ను కట్టేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆస్తి పన్ను వసూళ్లలో వివిధ రకాల సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. వాటి కారణంగా చాలా మంది పన్ను చెల్లించేందుకు యాజమానులు ఆలస్యం చేస్తూంటారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆస్తి పన్ను పరిష్కారం పేరుతో జీహెచ్ఎంసీ ప్రత్యేక మేళాలు రూపొందిస్తోంది. 90 శాతం వడ్డి రాయితీతో ఈ నెల 15వ తేదీ వరకు పన్నుచెల్లించేందుకు అవకాశం ఉండటంతో సమస్యలు పరిష్కరించి వీలైనంత ఎక్కువగా పన్ను వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఆస్తి పన్ను మేళాలు
దీనికోసం గ్రేటర్లోని అన్ని డిప్యూటి కమిషనర్ కార్యాలయాలు, జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో ఆస్తి పన్ను మేళాలు ఏర్పాటు చేశారు. ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం అన్ని పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవీ పని చేయనున్నాయి. ప్రతి ఆదివారంతో పాటు సేవల రోజుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా సర్కిల్ కార్యాలయాలలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉండనున్నారు. ఆస్తి పన్నులకు సంబంధించిన ఎలాంటి సమస్యలు అయినా ఈ మేళాల్లో పరిష్కారం చూపనున్నారు. దీంతో ఇటూ సమస్యల పరిష్కారంతో పాటు.. పన్ను వసూళ్లు కూడా పెరగనున్నాయి. ఆగస్టు 30న ప్రారంభమైన మేళాలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. 5 నెలల్లో మొత్తం 780 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు అయిందని... రానున్న రోజుల్లో నిర్దేశించుకున్న లక్ష్యం వరకు పన్ను వసూళ్లు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని కోసం క్షేత్రస్థాయిలో అధికారులు టార్గెట్ నిర్దేశించి పన్నుల వసూళ్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇదీచూడండి.. ' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'