కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేయాల్సిన జీహెచ్ఎంసీ సిబ్బంది నియమాలను పాటించడం లేదు. వ్యాక్సిన్ కేంద్రానికి ఒకేసారి తరలివచ్చిన సిబ్బంది భౌతికదూరాన్ని మరచి గుంపులుగా గుమిగూడారు. కొవిడ్ రెండోదశలో పంజా విసురుతుంటే జీహెచ్ఎంసీ సిబ్బంది ఇలా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం వద్ద జరిగింది.
![ghmc employees negligence to maintain physical distance at vaccine centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11374460_1.png)
భౌతికదూరం పాటించడం లేదు..
ముఖ్యంగా హైదరాబాద్లో కొవిడ్ రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తుండగా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. జరిమానా విధించడం, మాస్కులు పంపిణీ చేస్తున్నా... పారిశుద్ధ్య సిబ్బంది, సూపర్వైజర్లు మాత్రం మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేంద్రానికి వచ్చిన కొంతమంది పోలీసు సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించకుండా వ్యాక్సిన్ సిబ్బందిపై దురుసుగా వ్యవహరించారు.
![ghmc employees negligence to maintain physical distance at vaccine centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11374460_3.png)
సిబ్బంది నిర్లక్ష్యం
టీకాలు వేయించుకునేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది నిబంధనలు గాలికొదిలేయడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్మెట్, గాంధీనగర్, ముషీరాబాద్, బోలక్ పూర్, కవాడిగూడ డివిజన్ అనేక ప్రాంతాల్లోని వ్యాపార సంస్థల వద్ద ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.