హైదరాబాద్‌లో ప్రయాణిస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్లకు కొంత విశ్రాంతి ఇవ్వాలని... ఏదైనా ముఖ్యమైన ఫోన్ వస్తేనే మాట్లాడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులకు సూచించారు. వాహనంలో కూర్చొని చుట్టుపక్కల పరిస్థితులను, జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించాలని తెలిపారు. ప్రధాన రోడ్లు కాకుండా అనుబంధంగా ఉన్న చివరి రోడ్లల్లోనూ తనిఖీ చేయాలన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై కమిషనర్ లోకేష్ కుమార్ చర్చించారు.
యాచకులను పునరావాస కేంద్రాలు
పిల్లలతో భిక్షాటన చేయించడం సామాజిక నేరమని చెప్పారు. వివిధ కూడళ్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రధాన రోడ్లపై జరుగుతున్న యాచక ప్రక్రియను నాలుగైదు రోజులు గమనించి, మార్చి 2వ వారంలో వారిని పునరావాస కేంద్రాలకు తరలించటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు. సర్కిల్, జోనల్ స్థాయిలలో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కమిటీల సమావేశాలకు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రాత్రి ఆవాసాల్లో తాత్కాలికంగా 24 గంటలు భోజన వసతి, దినపత్రికలు, టెలీవిజన్లను ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
సామాజిక భద్రతా పథకాలు వర్తించేలా....
అనాథ, వృద్ధుల ఆశ్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల పనితీరును గమనించి, ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్న ఏజెన్సీలకు యాచక పునరావాస కేంద్రాల నిర్వహణను అప్పగించనున్నట్లు తెలిపారు. అటువంటి కేంద్రాల్లో పునరావాసం పొందిన యాచకులకు ఆధార్, రేషన్ కార్డులతోపాటు ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలను వర్తింపజేయనున్నట్లు తెలిపారు.
బిల్డ్ ఓన్ ఆపరేట్ పద్ధతి...
ప్రతి వార్డుకు రెండు చొప్పున మొత్తం 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి జోన్‌కు 500 చొప్పున నగరంలో కొత్తగా 3వేల ఆధునిక పద్ధతిలో ప్రజా మురుగుదొడ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం నగరవ్యాప్తంగా 1661 స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన 1339 ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. నిర్మాణం, నిర్వహణ భారం కాకుండా బిల్డ్ ఓన్ ఆపరేట్(బీఓఓ) పద్ధతిలో చేపట్టేందుకు కృషి చేయాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ ఉండాలని తెలిపారు. నిర్మాణం నిబంధనలను పటిష్ఠంగా రూపొందించి వారంలో టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు.
రెండు చెత్త డబ్బాలు ఉండాల్సిందే...
శానిటేషన్‌ను మెరుగు పరచడంలో భాగంగా ప్రధాన రోడ్లు దాదాపు వెయ్యి కిలోమీటర్ల వరకు ఉన్న వ్యాపార భననాలు, సంస్థల ముందు తప్పనిసరిగా రెండు డస్ట్ బిన్లు వారిచేతనే ఏర్పాటు చేయించాలని పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా ఉన్న నాలాల్లో పూడిక తీసివేత పనులు యుద్దప్రాతిపదికన ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
ఇదీ చదవండి: 'ఫోజులు ఆపి.. ఆటపై దృష్టి పెట్టండి'