GHMC Bills Due 2023 : హైదరాబాద్ మహానగర ప్రజలకు మౌలికసదుపాయలు కల్పించడంలో జీహెచ్ఎంసీకి నిత్యం తిప్పలు తప్పడంలేదు. ప్రభుత్వాలు, పాలకులు మారినా జీహెచ్ఎంసీలో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లు మారింది. ఉద్యోగుల జీతాల చెల్లింపులకే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా నగరంలో వందల కోట్ల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
GHMC Struggles With Bills Due : పనులు చేస్తున్న గుత్తేదారులకు ఏడాది నుంచి జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించకపోవడంతో వారు పూర్తిగా పనులు నిలిపేశారు. కొత్త టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడంలేదు. జీహెచ్ఎంసీలోని 6 సర్కిళ్లలో దాదాపు రూ.1100 కోట్లకుపైగా గుత్తేదారులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో బకాయిల కోసం గుత్తేదారులు ధర్నా చేస్తే రూ.300 కోట్ల వరకు విడుదల చేశారు.
GHMC Struggling With Funds : తాజాగా కాలనీల్లో పూర్తి చేసిన పనులకు రూ.700 కోట్లు, రెండు పడక గదుల ఇళ్లకు రూ.400 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. చార్మినార్, ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, కాప్రా సర్కిళ్లలోని అనేక కాలనీల్లో సీసీరోడ్లు, పైపులైన్ పనులు నిలిచిపోయాయి. గుంతలు పడిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. కమ్యూనిటి హాల్స్ నిర్మాణాలు, చిన్నచిన్న నాలాల విస్తరణ పనులు నిలిచిపోయాయి.
మూడు నెలలుగా పైసల కోసం ఎదురుచూపులే!
రాజధానిలోని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు ఇతరాత్ర పనులకు బల్దియా ఏటా బడ్డెట్లో దాదాపు రూ.500 కోట్ల నిధులు కేటాయిస్తోంది. కానీ క్షేత్రస్థాయి పనుల్లో ఆ బడ్జెట్ రెండింతలు దాటుతోంది. దీంతో జీహెచ్ఎంసీపై అదనపు భారం పడుతోంది. గత 10నెలలగా బకాయిలు చెల్లించకపోవడంతో గుత్తేదారులు అధికారులపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఆర్థిక విభాగం బిల్లుల చెల్లింపు విషయంలో కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
GHMC Proposed a New Policy in Payment of Bills : బ్యాంకు ద్వారా ట్రేడ్స్ విధానంలో గుత్తే దారులకు బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. బిల్లు మంజూరైన నాటి నుంచి నిధులు విడుదల చేసే రోజువరకు 7.7 శాతం వడ్డీని మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని గుత్తేదారుల ఖాతాలో జమ చేయాలని ప్రతిపాదించింది. గుత్తేదారులు ముందుకొస్తే మొత్తం బకాయిలకు ఇదే పద్ధతిలో నిధులు సమకూరుస్తామని జీహెచ్ఎంసీ ఆర్థిక విభాగం అధికారులు వివరించారు.
అయితే ఈ విధానంపై గుత్తేదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. బడ్జెట్లో పనులకు నిధులు కేటాయించి పనులు చేశాక బిల్లులపై ఆంక్షలు విధించడం గుత్తేదారుల వ్యవస్థను నీరుగార్చడమేనని వాపోతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో గుత్తేదారు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. మూడేళ్ల కిందట 5 నుంచి 6 వేల మంది ఉన్న కాంట్రాక్టర్ల సంఖ్య, చెల్లింపుల సమస్య, పనులపై ఆంక్షల వల్ల 2 నుంచి 3 వేలకు తగ్గిందని చెబుతున్నారు. ఫలితంగా ప్రజలకు కావాల్సిన పనులు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని, ఇది పూర్తిగా అభివృద్ధిని అడ్డుకోవడమేని గుత్తేదారులు అభిప్రాయపడుతున్నారు.
నిధుల సమీకరణపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు
GHMC Trying Funds From Tax : ప్రస్తుతం జీహెచ్ఎంసీ రూ.6వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దీంతో మళ్లీ నిధులు సమీకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నగరవ్యాప్తంగా 18.9 లక్షల ప్రాపర్టీలలో 2023 డిసెంబర్ 20నాటికి రూ.1208.35 కోట్ల ఆస్తిపన్ను సేకరించారు. ఆ నిధులు ఏమాత్రం సరిపోకపోవడంతో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆస్తిపన్ను వసూళ్లను ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. సర్కిళ్ల వారీగా ఆస్తిపన్ను బకాయిలు కట్టలేని వారి జాబితాను పరిశీలించి కొరడా ఝుళిపించాలని భావిస్తున్నారు.
Congress Government Plans On GHMC Bill : జీహెచ్ఎంసీలో పెండింగ్ బిల్లుల నిధుల విడుదలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన పనులపై తనిఖీ చేసిన తర్వాతే బిల్లులు విడుదల చేయాలనే ఆదేశాలు ఆర్థిక శాఖకు అందినట్లు సమాచారం. కేవలం ఉద్యోగుల జీతాలు మినహా మిగతా బిల్లులను ఆర్థిక విభాగం తాత్కాలికంగా నిలిపివేస్తునట్లు వినిపిస్తోంది. ఇప్పటివరకు శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలను మరోసారి అధికారుల నుంచి సేకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే జీహెచ్ఎంసీపై ప్రత్యేకంగా సమీక్ష చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పంచాయతీలకు నిధుల కొరత లేనేలేదు..
మౌలిక సౌకర్యాల అభివృద్ధికి జీహెచ్ఎంసీ లిస్టు ఇదీ.. నిధులు ఇవ్వండి ప్లీజ్..!