హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, జలమండలి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నగరంలో వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల్లో 6 రోజుల్లో మొత్తం 37 వేల కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయి. వీరందరికి ముఖ్యమంత్రి రేషన్ కిట్, మూడు బ్లాంకెట్లు, నిత్యావసరాలను బల్దియా అందిస్తోంది. బాధిత కుటుంబాల ఇళ్ల వద్దకే వెళ్లి... వీటిని అందిస్తున్నారు.
జీహెచ్ఎంసీ షెల్టర్లకు
ఆదివారం వరకు 20 వేల రేషన్ కిట్స్, బ్లాంకెట్లను అధికారులు పంపిణీ చేశారు. మిగిలిన రేషన్ కిట్స్, బ్లాంకెట్లను సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు వరద ప్రాంతాల్లోని కుటుంబాలకు పాలు, బ్రెడ్, బిస్కట్లను కూడా బల్దియా సిబ్బంది అందిస్తున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మధ్యాహ్నం 90 వేలు, సాయంత్రం 60 వేల భోజనాలను రెగ్యూలర్ అన్నపూర్ణ కేంద్రాలతో పాటు వరద ప్రాంతాల్లో ప్యాకింగ్ చేసి ఉచితంగా అందిస్తున్నారు. నగరంలో రాబోయే 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపునకు గురయ్యే మరింత మందిని జీహెచ్ఎంసీ షెల్టర్లకు తరలిస్తున్నారు.
సహాయక చర్యలు
కొన్ని ప్రాంతాల్లో వర్షం లేనప్పటికీ వరద మాత్రం ఇంకా ప్రజలను అతలకుతలం చేస్తోంది. వరదలతో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బ్లీచింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్, సోడియం హైపో క్లోరైడ్ కెమికల్ స్ప్రేయింగ్ చేయిస్తున్నారు. దీంతో పాటుగా నగర వ్యాప్తంగా ఇంటింటికి ఫివర్ సర్వే చేయించి.. అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. పలు కాలనీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో మొబైల్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని బల్దియా యోచిస్తోంది. ఎంటమాలజీ విభాగం తరఫున మొత్తం నగరంలో 125 బృందాలు ఎక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తున్నారు. 156 ప్రాంతాల్లో మొత్తం వరద నీరు ఉన్న ప్రాంతాలను గుర్తించి స్ప్రేయింగ్ చేశారు. దీంతో పాటు 2500 ఆయిల్ బాల్స్ వేశారు.
అత్యవసర సేవలకు సిద్ధం
వర్షాల నేథప్యంలో ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జలమండలి నిర్ణయించింది. మ్యాన్ హోల్ వద్ద పారుతున్న సేవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు... ఇతర అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి అదనంగా 700 మంది సిబ్బందిని జలమండలి నియమించుకోవడాని రూ.1.20 కోట్లు మంజూరు చేసింది. రిజర్వాయర్లు, వాటి ప్రాంగణాలు శుద్ధి, మరమ్మతులు చేస్తోంది. ప్రజలకు కలుషిత నీటితో ఇబ్బందులు కలగకుండా మంచినీటి నాణ్యత పరీక్షలు రెట్టింపు చేసి కేవలం 24 గంటల్లో 10 వేల నమునాలను మంచినీటి నాణ్యత పరీక్షలు నిర్వహించింది. దీంతో పాటు జలమండలి ఆధ్వర్యంలో నగరంలో క్లోరిన్ బిల్లలు పంపిణీ చేస్తోంది. ముంపునకు గురైన ప్రాంత ప్రజలకు నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. పునరావాస ప్రాంతాల్లో వాటర్ పాకెట్స్, వాటర్ క్యాన్ల ద్వారా తాగు నీటిని అందిస్తోంది.