Awarenes of Safety Precautions on Using Gas Cylinders : మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు.. సామాన్యులకు షాక్.. భారీగా గ్యాస్ ధరలను పెంచిన కేంద్రం.. గ్యాస్ ధరలను తగ్గించాలంటూ జనాల డిమాండ్. ధరల పెరుగుదలకు నిరసనగా ట్యాంక్ బండ్ లో గ్యాస్ సిలిండర్ల నిమజ్జనం.. ఇవన్నీ, నిత్యం వార్తల్లో వంట గ్యాస్ గురించి వినిపించే మాటలు.. కనిపించే దృశ్యాలు. గ్యాస్ ధరల పెంపు, తగ్గింపు అనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఇటీవల వంట గ్యాస్ వల్ల జరిగిన అగ్నిప్రమాదాలు గృహిణులను కలవరపెడుతున్నాయి. గ్యాస్ వినియోగం పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణ, ఆస్తి నష్టం తప్పకపోవచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
"గ్యాస్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉన్నాం. వంట చేసిన తర్వాత సిలిండర్‌ను ఆఫ్ చేస్తున్నాం. ఇంట్లో నుంటి బయటికి వెళ్లినప్పుడు, వచ్చిన తర్వాత గ్యాస్ బండను తనిఖీ చేస్తున్నాం." - గృహిణి
ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదొక సందర్భంలో.. వంటగ్యాస్ వినియోగం తప్పనిసరి. అలాంటి పరిస్థితుల్లో మన వంటింట్లోని గ్యాస్ సిలిండర్ వల్ల మనకు ప్రాణహాని ఉందని తెలిస్తే.. కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. సిలిండర్ బుక్ చేసిన దగ్గర్నుంచి అది ఇంటికొచ్చి వంటింట్లో తిష్ట వేసే వరకు అనుక్షణం అత్యంత జాగ్రత్తగా ఉండక తప్పదు. ఇళ్లొదిలి బయటికి వెళ్లినా ఓ సారి గ్యాస్ బండపై కన్నేసి పోవాల్సిందే. వచ్చాక కూడా మరోసారి అటువైపు చూడాల్సిందే.
"గ్యాస్ లీకేజీ ఎక్కడో ఉందో గుర్తించాలి. వాసన ఎక్కడ వస్తుందో చూడాలి. ఒకవేళ వాసన వస్తే ఇంట్లోని కిటీకీలు తలుపులు తీసి ఉంచాలి. అవసరమైతే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. గ్యాస్ పైపును కూడా ఎప్పటికప్పుడూ తనిఖీ చేసుకోవాలి." - మోహన్ రావు, అగ్నిమాపకశాఖ అధికారి ,హైదరాబాద్
నాలుగేళ్లుగా హైదరాబాద్లో జరిగిన సంఘటనలు మచ్చుకు ఒకసారి పరిశీలిస్తే.. గుండె జల్లుమంటుంది. బంజారాహిల్స్‌లోని బసవతారకనగర్‌లో ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఏడుగురికి గాయాలయ్యాయి. భవన శిథిలాలు ఎగిరిపడటంతో పక్కింట్లో భోజనం చేస్తున్న ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. బోరబండ పరిధిలోని అల్లాపూర్‌లో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ గాయపడింది. బాధిత మహిళ తన ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు చేలరేగాయి. మంటలంటుకున్న ఆ గృహిణికి తీవ్రగాయాలయ్యా యి. చాదర్‌ఘాట్ పరిధిలోని కాలాడేరా బస్తీలో ఓ ఇంట్లో వంట గ్యాస్‌సిలిండర్ పేలిపోయింది. సిలిండర్ పేలడానికి ముందే గ్యాస్ లీక్ కావడంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఇటీవల దోమలగూడలోని ఓ ఇంట్లో అమ్మవారికి బోనం వండుతుండగా.. గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రగాయాలతో ఒక్కొక్కరిగా మృతి చెందారు. అది స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అలాగే ఇటీవల ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులోని ఒక గుడిసెలో.. నిప్పు రవ్వలు చేలరేగడంతో అక్కడే ఉన్న గ్యాస్‌సిలిండర్ పేలి ముగ్గురు నిరుపేదలు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 2022లో రాజస్థాన్ జోధ్పూర్ జిల్లాలో ఓ పెళ్లిలో వంటగ్యాస్ సిలిండర్ పేలి.. 32 మందికిపైగా మరణించారు. 50 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో నరకం అనుభవించారు. ఇలా పల్లెలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలనే తేడా లేకుండా తరుచూ వంటగ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి.
Gas Cylinder Safety : నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో రెండేళ్ల కిందట వెల్లడించిన నివేదిక ప్రకారం.. వంట గ్యాస్ వల్ల దేశవ్యాప్తంగా 1563 ప్రమాదాలు జరిగాయి. అందులో 1552 మంది చనిపోగా 52 మంది క్షతగాత్రులయ్యారు. వంట గ్యాస్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఎక్కువగా తమిళనాడులో జరిగినట్లు తేలింది. తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. గడిచిన రెండేళ్లలోనూ ఈ ప్రమాదాల సంఖ్య మరింత పెరిగింది. గుజరాత్లో గ్యాస్ సిలిండర్ల వల్ల జరిగిన అగ్నిప్రమాదాల్లో 735 మంది మరణించారు. చెన్నైలో 586, ఏపీలో 426, కర్ణాటకలో 386, కేరళలో 52, తెలంగాణలో 45 మంది మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి : ఓ ఇంట్లో పేలిన సిలిండర్.. పక్కింట్లో నలుగురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక వ్యక్తికి తీవ్రగాయాలు..