2018 డిసెంబర్లో సింగపూర్ నుంచి విజయవాడ చేరుకుంది తొలి విదేశీ విమాన సర్వీసు. వందే భారత్ మిషన్లో భాగంగా ఆ సంఖ్య 200 మార్క్ దాటింది. విదేశీ సర్వీసుల రాకపోకల్లో దేశంలోనే తొలి 15 స్థానాల్లో విజయవాడకు చోటుదక్కడం విశేషం. విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు సారధ్యంలో సిబ్బంది కృషితో అన్ని విధాలుగా ప్రయాణికుల భద్రత, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సుమారు 50 వేల మంది ప్రవాసాంధ్రులను ఏపీకి చేర్చారు.
కరోనా లాక్డౌన్లో విమానాశ్రయంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన జజీరా, కువైట్, సలాం, గల్ఫ్ విదేశీ విమానయాన సంస్థలు.. లాక్డౌన్ అనంతరం తమ సర్వీసులు నడిపేందుకు ముందుకొచ్చాయంటే విమానాశ్రయం అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ విస్తీర్ణం కలిగిన తాత్కాలిక భవనాలు అయినప్పటికీ ప్రయాణికులకు ఉత్తమ సేవలందించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
2014-15 మధ్య 2.3 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య.. 2019-20కి 11.8 లక్షలకు చేరి పౌర విమానయాన అధికారులను సైతం అబ్భురపరిచింది. సాధారణ సర్వీసులతో పాటు కార్గో సర్వీసులలోనూ విజయవాడ విమానాశ్రయం దూసుకుపోతోంది. కోడ్ ఎయిర్పోర్ట్ కింద 4400 మీటర్ల రన్వే విస్తరణ, నూతన ట్రాఫిక్ కంట్రోల్ టవర్, రూ.470 కోట్లతో అధునాతన టెర్మినల్ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అనుమతి లభించగా.. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం 2286 మీటర్ల రన్వే ఉంది. అది 3360 మీటర్లు ఉన్నట్లతే అమెరికా, లండన్ ఇతర అగ్ర దేశాల సర్వీసులు రాకపోకలు సాగించేందుకు వీలుండేది. 2015 అక్టోబర్ 13న విమానాశ్రయం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మధుసూదనరావు తన ఐదేళ్ల సర్వీసు విమానాశ్రయం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది అనడంలో అతిశయోక్తి లేదు. వందే భారత్ మిషన్లో భాగంగా భౌతికదూరం, కరోనా పరీక్షలు, మాస్క్ ఇతర కిట్లు అందిస్తూ ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు అధికారులు తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు ప్రశంసించారు.