Gangula Kamalakar CBI Investigation: సీబీఐ అధికారినంటూ పలువురిని మోసగించిన కేసులో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును గత శనివారం సీబీఐ అధికారులు దిల్లీలో అరెస్టు చేశారు. ఆయన ఫోన్‌లో ఉన్న కాల్ లిస్ట్, ఫొటోల ఆధారంగా మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొనడంతో వారిరువురూ దిల్లీ వచ్చారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలో సీబీఐ ఎస్పీ షయాలి తురత్, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు వారిని ప్రశ్నించారు. ఉదయం పదకొండున్నరకు విచారణ ప్రారంభించిన అధికారులు.. రాత్రి 8 గంటల వరకు కొనసాగించారు.
కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు, అతని బాధితులైన మరికొందరిని విచారణ సమయంలో హాజరుపర్చారు. ‘మంత్రి, ఎంపీని గుర్తుపట్టారా..' అని శ్రీనివాసరావును ప్రశ్నించగా..‘గుర్తుపట్టాను’ అని అతను బదులిచ్చినట్టు సమాచారం. అనంతరం మంత్రి, ఎంపీ.. శ్రీనివాసరావుతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు, సీసీ కెమెరాల్లో వారు మాట్లాడుకుంటున్న దృశ్యాలతో పాటు సేకరించిన డాటాను విచారణాధికారులు వారి ఎదుట ఉంచారు.
‘శ్రీనివాసరావుతో పరిచయం.. ఆయన మొబైల్‌లో ఫోన్ నంబరు ఉండటానికి గల కారణాలు.. ఫొటోలు తీసుకున్న చోటు తనతో ఉన్న సంబంధాలపై ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించారు. ‘‘వారం క్రితం ఓ మున్నూరుకాపు సమావేశంలో శ్రీనివాసరావును కలిసినట్లు.. మొత్తంగా రెండుసార్లు కలుసుకున్నామని మంత్రి బదులిచ్చినట్లు తెలిసింది. మున్నూరు కాపు బిడ్డగా, ఐపీఎస్ అధికారిగా భావించి మాట కలిపాం తప్పితే.. ఆయనతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని గంగుల చెప్పినట్లు సమాచారం.
సీబీఐ అధికారులకు అన్నీ వాస్తవాలే చెప్పాం: అనంతరం శ్రీనివాసరావును అధికారులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా.. ఆయన కూడా మున్నూరు కాపు సంఘం సమావేశానికి వెళ్లినట్టు అంగీకరించారని తెలిసింది. విచారణ అనంతరం వారి వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు.. సంతకాల అనంతరం మంత్రి, ఎంపీలను పంపించి వేశారు. సీబీఐ అధికారులకు అన్నీ వాస్తవాలే చెప్పామని మంత్రి గంగుల కమలాకర్ విచారణ అనంతరం తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత ఒక్క రోజే గడువు ఇచ్చినప్పటికీ చట్టాలు, న్యాయంపై గౌరవంతో విచారణకు హాజరయ్యామన్నారు. శ్రీనివాసరావుకు డబ్బులు ఇవ్వజూపామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
"మమల్ని సీబీఐ అధికారులు అడిగినా వాటికి సరైన సమాధానాలు ఇచ్చాం. మేము తప్పు చేయలేదు కాబట్టి అన్నీ వాస్తవాలు చెప్పాం. . శ్రీనివాసరావును అధికారులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆయన కూడా మున్నూరు కాపు సంఘం సమావేశానికి వెళ్లినట్టు తెలిపారు. విచారణ అనంతరం అధికారులు సంతకాలు చేయించుకొని పంపించారు." - గంగుల కమలాకర్ , మంత్రి
ఇవీ చదవండి: 'ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల రుణాన్ని అభివృద్ధితో తీర్చుకుంటాం'
ఎయిర్పోర్ట్లో సర్వర్ క్రాష్.. ఫ్లైట్స్ ఆలస్యం.. ప్రయాణికుల కష్టాలు