వినాయక నిమజ్జన(ganesh Immersion) ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ(GHMC) దృష్టి సారించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్(CP Anjani kumar) ఇతర అధికారులతో కలిసి ట్యాంక్ బండ్(tank bund), పీవీ ఎన్ఆర్(pvnr), ఎన్టీఆర్ మార్గ్‌ల్లో(ntr marg) సందర్శించారు.
అధికారుల పరిశీలన
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల చేపట్టిన సుందరీకరణకు ఎలాంటి నష్టం జరగకుండా... నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే నిమజ్జనం జరుగుతుందని అర్వింద్ కుమార్ వెల్లడించారు. పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం కోసం అదనపు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
హైకోర్టు విచారణ
వినాయక నిమజ్జనం సందర్భంగా అమలు చేయదగిన ఆంక్షలు, నియంత్రణ చర్యలను సూచించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు(telangana high court) ఇటీవలె ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యచరణ సమర్పించాలని అదేవిధంగా గణేశ్ ఉత్సవసమితి, పిటిషనర్ కూడా నివేదికలు ఇవ్వాలని కోరింది. హుస్సేన్ సాగర్‌లో(hussain sagar) గణేశ్ నిమజ్జనాన్ని నిషేధించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ధర్మాసనం ఇటీవలె విచారణ చేపట్టింది.
సూచనలు సరిపోవు..
కొవిడ్(covid) నేపథ్యంలో జీహెచ్ఎంసీకి, ప్రజలకు పలు సూచనలు చేసినట్లు పీసీబీ తరఫు న్యాయవాది తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 50వేల మట్టి గణపతులను(eco friendly ganesh) ఉచితంగా పంపిణీ చేస్తున్నామని.. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలో పలు చెరువులను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. అయితే సూచనలు సరిపోవని.. నిర్దుష్టమైన సూచనలు ఇస్తే తాము ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.
హైకోర్టు ఆదేశాలు
కరోనా(corona) పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానికంగా నిమజ్జనం చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఏడాది పొడవునా.. వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారని.. నిమజ్జనం సమయంలో వాటన్నింటినీ తొలగిస్తున్నారని.. దానివల్ల ప్రజాధనం వృథా అవుతోదందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందరి సూచనలను తమ ముందుంచితే.. వాటన్నింటినీ పరిశీలించి ఈ నెల6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.
ఇదీ చదవండి: రోడ్డు పైనుంచి వరద నీరు.. రెండు గ్రామాలకు రాకపోకలు బంద్