Ganesh Immersion in Hyderabad 2023 : వినాయక చవితి(Ganesh Chaturthi 2023) నుంచి నిమజ్జనం వరకు గ్రేటర్లో సందడి వాతావరణం నెలకొంటుంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడ్ని శోభాయాత్రగా భారీ వాహనాల్లో తరలిస్తారు. భక్తి శ్రద్ధలతో గణపయ్యను పూజించి..'బైబై గణేశా' అంటూ నృత్యాలు చేసుకుంటూ, భాజా భజంత్రీలతో ఊరేగించి నిమజ్జనం చేస్తారు. మూడు, ఐదు, 9 రోజుల్లో గణేశ్ నిమజ్జనం చేస్తారు. గ్రేటర్ పరిధిలో సుమారు 90 వేల పైచిలుకు గణపతులను ప్రతిష్ఠించినట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే నిమజ్జనానికి అవసరమైన వాహనాల అద్దెలపై రవాణా శాఖ(Telangana Transport Ministry) దృష్టి సారించింది. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Ganesh Idols Immersion Telangana 2023 : ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు, ఆర్టీవోలతో రవాణా శాఖ అధికారులు(Transport Department Officials) సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో వాహనాల లభ్యత, ఏ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.. ఎంత అద్దెలు తీసుకుంటున్నారు..? తదితర అంశాలపై చర్చించి రవాణా శాఖ అధికారులే అద్దె విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు సైతం అద్దె విషయంలో రవాణా శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అద్దెలు భారీగా ఉన్నాయని.. మండప నిర్వాహకులకు భారంకాకుండా చూసుకోవాలని కోరారు.
Vehicles On Rent For Ganesh Idols Immersion in Hyderabad : ఈనెల 28వ తేదీన జరిగే మహా నిమజ్జనానికి(Ganesh idols Immersion) 10 అడుగులు, అంతకంటే ఎక్కువ విగ్రహాలకు మాత్రమే వాహనాలను సమకూర్చనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా శాఖ అధికారి పాండు రంగానాయక్ పేర్కొన్నారు. రవాణా శాఖ అధికారులు నిర్ణయించిన ప్రకారం.. భారీ ట్రైలర్‌కు.. 33 వేలు, హెచ్‌జీవీ టస్కర్(HGV Tusker) రూ.3 వేలు, హెచ్‌జీవీ 2 వేలు, ఎల్‌జీవీ వాహనానికి 15 వందలు, టాటా ఏస్ 1,000లు అద్దె తీసుకునే విధంగా నిర్ణయించినట్లు తెలిపారు.
'హైదరాబాద్ సిటీలో 3, 5,7రోజులు ఆఖరుగా 28వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ బయలుదేరి నిమజ్జనం జరుగుతుంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తుంది. ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా ఏర్పాట్లు గ్రాండ్‌గా ఉంటాయి.' - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
Transporters Problems in Hyderabad : గ్రేటర్ పరిధిలోని వివిధ రవాణా వాహనదారుల అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం రవాణా శాఖ అధికారుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే అద్దెలు తక్కువగా వస్తున్న తరుణంలో రవాణా శాఖ అధికారులు అద్దెలు నిర్ణయించడం ఆర్థికంగా మరింత నష్టం చేకూరుతుందని ఆందోళన చెందుతున్నారు.