Gaddar Final Journey : నడుముకు తెల్లటిపంచె, ఒంటిపై నల్లటి గొంగడి, కాళ్లకు గజ్జెలు, చేతికి కడియాలు, తలకగు ఎర్రటి వస్త్రంతో గద్దర్ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు. ఒగ్గుకథ, బుర్రకథ, ఎల్లమ్మ కథలను ప్రజలకు చెప్పే కళాకారుడిగా సాంస్కృతిక చైతన్యాన్ని ప్రారంభించిన గద్దర్.. క్రమంగా ప్రజలు ఇతివృత్తంగా ఉండే సమస్యలు, వివక్షపై కలం ఝళిపించారు. కుటుంబ నియంత్రణ, అస్పృశ్యత, ప్రపంచీకరణ ప్రభావం, కుల వివక్ష, దోపిడీ, వెనుకబాటు తనం, పల్లెల అమాయకత్వంపై అనేక రూపాల్లో ఎన్నో పాటలు పాడారు.
Folk Singer Gaddar Final Journey : పాటనే ఆయుధంగా చేసుకుని.. సమాజంలో దోపిడి, అసమానతలపై చివరి దాకా పోరాడి దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన విప్లవ గాయకుల్లో అగ్రగణ్యునిగా పేరొందిన అభినవ వాగ్గేయకారుడికి అభిమానలోకం విప్లవ జోహార్లు పలికింది. గజ్జెకట్టి ఆడి, పాడి జనాన్ని ఉర్రూతలూగిస్తూ 5 దశాబ్దాలుగా ప్రతి తెలుగు ఇంటికి సుపరిచితమైన గద్దర్ కడసారి చూపు కోసం వేలాదిగా జనం సందోహం తరలివచ్చింది.
Gaddar Last Rites with Official Ceremonies : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సందర్శనార్థం ఉంచిన గద్దర్ భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, వీహెచ్, బీజపీ నేతలు రఘునందన్‌రావు, మేయర్ విజయలక్ష్మి, వామపక్షాల నేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, విమలక్క, సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, మోహన్‌బాబు, మనోజ్, నాగబాబు, నిహారిక, అలీ, ఎన్‌శంకర్‌తో పాటు అనేక కవులు, కళాకారులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి గద్దర్‌కు నివాళి అర్పించారు. గద్దర్ పోరాటం, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Huge Crowd at Gaddar Final Journey : కళాకారుల ఆటాపాటల మధ్య మధ్యాహ్నం పన్నెండున్నరకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. డప్పు దరువులు జానపద కళాకారుల ఆటపాటలతో.. నాంపల్లిలోని గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న గద్దర్ అంతిమయాత్ర.. బషీర్ బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ మీదుగా తరలివెళ్లింది. గద్దర్ అంతిమయాత్ర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనంతో.. గన్‌పార్కు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.
Gaddar Anthima Yatra Hyderabad : అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయన భౌతికకాయానికి పూల దండ వేసి ఘన నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రజాగాయకుడిని స్మరించుకున్నారు. అనంతరం గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. సానుభూతి తెలియజేశారు. అతని మృతిని స్మరించుకుంటూ తెలంగాణ సమాజానికి, ఉద్యమ స్ఫూర్తికి లోటు ఏర్పడిందన్నారు. గద్దర్ పాటల రూపంలో తెలంగాణ ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచిపోతారని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్ మీదుగా అంతిమయాత్ర.. మహాబోధి స్కూల్ ఆవరణకు చేరుకోగా.. గద్దర్ అమర్ రహే అంటూ అభిమానుల నినాదాలు చేశారు. పాఠశాల ఆవరణలో గద్దర్ అంతిమ సంస్కారాలు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి.
మరోవైపు ప్రజాగాయకుడు మరణ వార్త తెలిసి తాను చాలా బాధపడినట్లు.. గద్దర్ భార్య విమలరావుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ సోనియాగాంధీ లేఖ రాశారు. కళను, సంస్కృతిని వ్యక్తీకరణ సాధనాలుగా ఉపయోగించి అణగారిన వర్గాల్లో పోరాట పటిమను పెంచడంలో గద్దర్ కీలక పాత్ర పోషించారని ఆమె కొనియాడారు. గద్దర్ తన పాటలతో ప్రజా సమస్యలపై అవగాహన పెంచేందుకు అంకితభావంతో, నిబద్ధతతో పని చేశారని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు ఈతరం వారికి స్పూర్తిదాయకంగా నిలుస్తాయన్న సోనియాగాంధీ గద్దర్ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియచేశారు.
మరోవైపు గద్దర్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన ఉర్దూ పత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. గద్దర్‌ను తరలిస్తున్న వాహనంలో ఆయన కూడా ఉన్నారు. ఒక్కసారిగా గుండెనొప్పితో కిందపడిపోయారు. పక్కన ఉన్నవారు ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.