ఏప్రిల్ నుంచి ఆయా ప్రాంతాల్లో నల్లాదారులందరికీ నీటి బిల్లులు జారీ చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత నీటి పథకం అమలు చేస్తున్నట్లు గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఉత్తర్వుల్లో తొలుత జలమండలి పరిధి వరకు అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో గ్రేటర్‌తో పాటు శివార్లలో 22 పురపాలక సంఘాలతోపాటు మీర్‌పేట, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగిర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట, జవహర్‌నగర్ కార్పొరేషన్లకు ఈ పథకం వర్తించే అవకాశం ఉందని జలమండలి అధికారులు భావించారు. గత డిసెంబరు నుంచి జీహెచ్‌ఎంసీతోపాటు ఆయా ప్రాంతాల్లో కూడా నీటి బిల్లులు వసూలు చేయడం మానేశారు. అయితే ఇటీవల మార్గదర్శకాల్లో సదరు పథకం గ్రేటర్ వరకే అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేయడంతోపాటు తాజాగా ఉన్నతస్థాయి నుంచి స్పష్టత రావడంతో శివారుకు ఉచిత పథకం లేదని తేలిపోయింది. నగర శివారు వినియోగదారులకు ఇది ఇబ్బందికర అంశమే.
బిల్లుల చెల్లింపులో వెసులుబాటు..:
శివార్లలో ఉచిత నీటి పథకం అమలుపై స్పష్టత లేకపోవడంతో గతేడాది డిసెంబరు నుంచి నీటి బిల్లుల సరఫరా నిలిపేశారు. ప్రస్తుతం ఏప్రిల్ నుంచి బిల్లులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డిసెంబరు నుంచి మార్చి వరకు ఒకేసారి నాలుగు నెలల బిల్లులు అందించనున్నారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ల వాసులు ఒకేసారి పెద్ద మొత్తంలో బిల్లులు అందుకోనున్నారు. 50-100 ఫ్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్లకు నెలకు రూ.10-15 వేల వరకు బిల్లులు రానున్నాయి. ఈ లెక్కన నాలుగు నెలలకు గాను ఒక్కో అపార్ట్‌మెంట్‌కు రూ.40-60 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తిగత గృహాలకు రూ.1500-5 వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. అయితే బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పిస్తామని, జరిమానా లేకుండా అసలు బిల్లు కడితే చాలని అధికారులు చెబుతున్నారు.
- ఇదీ చూడండి: 'జానారెడ్డి గెలుపు.. రాష్ట్ర రాజకీయాల్లో మలుపు'