హైదరాబాద్‌లో ఆహార భద్రతా లబ్ధిదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 14.86 లక్షల పైచిలుకు కుటుంబాలకు అందజేసినట్లు పౌరసరఫరాల శాఖాధికారులు వివరించారు. మరో ఒకట్రెండు రోజులు పంపిణీని కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడు జిల్లాల్లో బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. 20వ తేదీ వరకు హైదరాబాద్ జిల్లాలో 5.52 లక్షలు, మేడ్చల్‌లో 4.68 లక్షలు, రంగారెడ్డిలో 4.66 లక్షల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు.
సాధారణంగా ప్రతి నెలా ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దుకాణాలను మూసివేయొద్దంటూ కొన్ని రోజుల కిందట అధికారులు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. 95 శాతానికిపైగా కార్డుదారులు బియ్యం తీసుకున్నారని, దుకాణాలను మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ డీలర్లు తాజాగా విజ్ఞప్తి చేశారు. మిగిలిన కార్డుదారులు ఇబ్బంది పడే అవకాశముందని, అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు పంపిణీ ప్రక్రియను నిలిపేయొద్దని అధికారులు స్పష్టం చేశారు.