కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టని.. దీనిపై విచారణ చేయాలని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు. కమీషన్‌ల కోసం రీ-డిజైన్ చేసి రూ.36 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు రైతులతో కలిసి ఆయన రాజ్‌భవన్‌లో తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో పంట నీట మునిగి నష్టపోవడంతో నిన్న ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చెన్నూరు నియోజకవర్గ రైతులతో కలిసి గవర్నర్‌కు వివరించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. చెన్నూరు, మంథని నియోజకవర్గాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. మూడేళ్లుగా వానాకాలం పంట నష్టపోతున్నామని.. ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని కోరారు. స్పందించిన గవర్నర్ ప్రభుత్వంతో మాట్లాడతామని రైతులకు హామీ ఇచ్చారు.
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ కమీషన్లు దోచుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. రూ.36 వేల ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచారు. ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల చెన్నూరు, మంథని నియోజకవర్గాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో పంటనష్టం జరుగుతుంది. మేము ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని కోరాం. - వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి
ఇదీ చూడండి: KCR meets Shekhawat: ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ పరిధిలోకి తేవాలి : కేసీఆర్