మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి జయలతాదేవి(91) శనివారం ఉదయం 6.30 గంటలకు అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి దివంగత జస్టిస్ కొండా మాధవరెడ్డి సతీమణి జయలతాదేవి. కొంతకాలం క్రితం కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. వయోభారంతో మృతిచెందారు. బంజారాహిల్స్‌లో విశ్వేశ్వర్‌రెడ్డి ఇంట్లో ఉంటున్నారు. ఈమెకు ముగ్గురు కుమార్తెలు.
ఆమె గతంలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విశ్వేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. సినీ అగ్ర నటుడు చిరంజీవి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి శనివారం కొండా నివాసానికి చేరుకొని జయలతాదేవి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. విదేశాల్లో ఉన్న కూతురు, బంధువులు వచ్చిన తర్వాత సోమవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జయలతాదేవి మృతి పట్ల సీజేఐ సంతాపం
బాంబే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కొండా మాధవరెడ్డి సతీమణి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాతృమూర్తి జయలతాదేవి మృతిపట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జస్టిస్ మాధవరెడ్డి యువ న్యాయవాదుల్ని ఎంతో ప్రోత్సహించేవారని.. ఆయన వెన్నంటి నిలిచిన జయలతాదేవి ఆప్యాయతకు మారుపేరని.. ఆ కుటుంబంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి: ఎస్సీ సాధికారతపై సర్కార్ నజర్.. నేడు సీఎం అఖిలపక్ష భేటీ