ఆలస్యంగా పంట వేసిన రైతులు పండించిన ధాన్యం సాధ్యమైనంత త్వరగా కొనుగోలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రుల నివాస ప్రాంగణంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కలిశారు. అకాల వర్షాల నుంచి తక్కువ ధరలో ధాన్యం తాత్కాలికంగా కాపాడుకోవడానికి తాము ఆలోచించిన స్ట్రెచ్ ఫిల్మ్ రోల్ (STRECH FILM ROLL) విధానం రైతులందరికీ తెలియజేసి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. రైతాంగం మంచి కోసం చేసిన ఆలోచన బాగుందని.. ఆ స్ట్రెచ్ ఫిల్మ్ రోల్ తయారీదారుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ వినూత్న పద్ధతిని తప్పకుండా ఆచరణలో పెట్టడానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాండూరు, పెద్దేముల్, యాలాల, దోమ, కుల్కచర్ల, బుల్కాపూర్, సర్దార్‌నగర్, మహేశ్వరం తదితర కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలపై ఫిర్యాదు చేసిన ఆయన.. యుద్ధప్రాతిపదికన పంట కొనుగోలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
ఇదీ చూడండి: ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు