Telangana BJP Latest News : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి బీజేపీలో చేరిన నేతలు అంతరంగిక సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ అంతర్గత సమావేశానికి విజయశాంతి, వివేక్ వెంకట స్వామి, కొండా విశ్వేశ్వరరెడ్డి, బూర నర్సయ్య గౌడ్, విఠల్, రవీంద్ర నాయక్, దేవయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అంటూ జరుగుతున్న ప్రచారంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్‌లో ఉండగా.. దిల్లీ వెళ్లి లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని చర్చించుకున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న నాయకులకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడం లేదని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సమావేశం అనంతరం జితేందర్ రెడ్డి స్పందించారు. కేవలం మర్యాదపూర్వకంగానే తామంతా సమావేశమయ్యామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి రహస్య ఎజెండా లేదని స్పష్టం చేశారు.
- Etela Rajender Delhi Tour : దిల్లీకి ఈటల పయనం.. రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామం..!
- Bandi Sanjay Reacted TDP Issue : 'చంద్రబాబు అమిత్‌షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి ?'
"కావాలనే సీఎం కేసీఆర్ మీడియాలో లీకులు ఇస్తున్నారు. బీజేపీ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో తమ పార్టీ కేడర్ పని చేయకుండా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు బీజేపీలో ప్రచార కమిటీ పదవి లేదు. రాష్ట్ర నేతలతో చర్చించకుండా జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదు"- జితేందర్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
పదవులు ఇచ్చే మందు లీకులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో లేదని జితేందర్ రెడ్డి అన్నారు. అసలు బీజేపీలో ప్రచార కమిటీ పదవి లేదని కొట్టిపారేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారని కేసీఆర్ లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీ బలం తగ్గిందని చెప్పడానికే కాంగ్రెస్‌పై మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామీణ స్థాయి నుంచి తమ పార్టీ కేడర్ పని చేయకుండా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర నేతలతో చర్చించకుండా జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదని తేల్చి చెప్పారు.
"బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పుపై మీడియా లీకేజీలు సరి కాదు. బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ బండి సంజయ్ కొనసాగుతారని తరుణ్ చుగ్ గతంలోనే చెప్పారు. నేతల భేటీలపై ఊహాగానాలతో వెలువడే మీడియా కథనాలు, సమాచారం ఎప్పటికీ అధికార ప్రకటనలు కావు. వీటి ప్రభావం పార్టీపైనా, ప్రజల్లోనూ ఉండదు. పార్టీ అధికార ప్రతినిధుల నుంచి మాత్రమే కచ్చితమైన సమాచారం లేదా ప్రకటన వస్తుంది." -విజయశాంతి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు
ఇవీ చదవండి: