Former MLA Interesting Comments on Pawan : ఇవాళ చంద్రబాబు, పవన్ కలయిక నేపథ్యంలో ఏపీలోని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ అనంతపురంలోకి వచ్చి పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అనంతపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రభాకర్ చౌదరి తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేయడమే కాకుండా, తన భుజస్కందాల మీద మోసి ఆయన్ని గెలిపిస్తానన్నారు.
వైసీపీ ఓటమి, జగన్ ఇంటికి పోవడమే మా రెండు పార్టీల లక్ష్యమని.. ఇందులో భాగంగా పొత్తు కుదిరితే తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలకు తన వ్యూహం వేరే ఉందని పవన్ గతంలో చెప్పారని, ఇవాళ చంద్రబాబుతో కలయిక అందులో భాగమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాము పని చేస్తామని, ఆయన ఎవరిని సూచించినా వారి గెలుపు కోసమే పని చేస్తామన్నారు. మరోవైపు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తన మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రభాకర్ చౌదరి మరోసారి తీవ్రంగా స్పందించారు.
'పవన్ కల్యాణ్ కేండిడేట్‌గా అనంతపురం వచ్చి పోటీ చేస్తానంటే దగ్గరుండి మంచి మెజార్టీతో అనంతపురం అసెంబ్లీ నుంచి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాను. జనసేన, టీడీపీ పొత్తు ఉన్నప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే పవన్ కల్యాణ్‌ను అనంతపురంలో భుజం మీద వేసుకుని గెలిపిస్తా. నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొత్తులో ఎవరికి ఇచ్చినా మేము పని చేస్తాం. పార్టీ నిర్ణయాల ప్రకారం ఉంటాం. వైసీపీ ఓడిపోవాలి అంతే. ఇక్కడ అనంత వెంకట్రామిరెడ్డి గెలవకూడదు.'- ప్రభాకర్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: