మహనీయుల ఆశయాలను కొనసాగింపుగా విగ్రహాలను ఏర్పాటు చేసి వారిని స్మరించుకోవడం గొప్ప సంస్కృతి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టాప్ ఆవరణలో కంటోన్మెంట్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణస్వామి విగ్రహంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి ఈటల శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ మొదటి మేయరైన కృష్ణస్వామి ముదిరాజ్ లాంటి మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈటల అన్నారు. విగ్రహ ఆవిష్కరణ కోసం తెరాస పార్లమెంటరీ ఇంఛార్జి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు చేసిన కృషిని ఆయన అభినందించారు.
ముదిరాజ్ సామాజిక వర్గ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కృష్ణస్వామి ముదిరాజ్ వంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు పిట్ల నాగేష్ ,కరాటే రాజు, రామస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విందులో పాల్గొన్న 40 మందికి అస్వస్థత..