Somesh Kumar appointed as Chief Advisor to CM KCR: అందరూ ఊహిస్తున్నట్లుగానే విశ్రాంత ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ఆయన నియమితులయ్యారు. కేబినెట్ హోదాలో మూడు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రగతి భవన్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌ని సోమేశ్ కుమార్ కలిసి.. కృతజ్ఞతలు తెలిపారు.
హైకోర్టు తీర్పు, డీవోపీటీ ఆదేశాలతో సీఎస్ పదవిని కోల్పోయిన సోమేశ్ కుమార్... ఏపీలో రిపోర్ట్ చేసినప్పటికీ ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన భారాస సమావేశంలో ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమ్యారు. దాంతో సోమేశ్ కుమార్ తదుపరి పాత్రపై పలు ఊహాగానాలు వినిపించాయి. ఆయన్ని తన ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి సోమవారం నుంచే ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రధాన సలహాదారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటి సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించి పదవీవిరమణ చేసిన రాజీవ్ శర్మను... ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. దీంతో అప్పట్నుంచి ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా సోమేశ్ కుమార్: తాజాగా సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా నియమించారు. అటు రాష్ట్ర ఆవిర్భావం నుంచే విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి, విశ్రాంత ఐఈఎస్ అధికారి జీఆర్ రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. రమణాచారి సాంస్కృతిక, దేవాదాయ వ్యవహారాలు చూస్తుండగా... జీఆర్ రెడ్డి ఆర్థికశాఖ సలహాదారుగా ఉన్నారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్.. మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా బాధ్యతల్లో ఉన్నారు. రాష్ట్ర మొదటి డీజీపీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మను శాంతి, భద్రతల సలహాదారుగా ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్.. అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా కొనసాగుతున్నారు. విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి ఆర్. శోభ... అటవీ వ్యవహారాల సలహదారుగా ఉన్నారు. రహదార్లు, భవనాల శాఖలో ఆర్కిటెక్చర్, బిల్డింగ్, ప్రణాళికా విభాగానికి సలహాదారుగా సుద్దాల సుధాకర్ తేజ కొనసాగుతున్నారు.
సోమేశ్ కుమార్ ఏపీ టు తెలంగాణ: సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన బిహార్ రాష్ట్రంలో జన్మించారు. ఉమ్మడి ఏపీలో బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజించినప్పుడు ఏపీ క్యాడర్‌కి కేటాయించిన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులతో ఆయన రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించారు. క్యాట్ ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసినందున ఆయన ఆంధ్రప్రదేశ్‌కి బదిలీ అయ్యారు. దీంతో ఏపీలో కొన్ని రోజులు పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన చాలా స్వల్ప సమయంలోనే విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమోదించారు. అనంతరం ప్రస్తుతం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా నియమించారు.
ఇవీ చదవండి: