కొవిడ్-19 నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా సహాయం పొందవచ్చని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నూతన వ్యవసాయ చట్టాలపై రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
అన్నదాతల ప్రయోజనాల దృష్ట్యా రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ సంస్కరణలు పరిశీలిస్తే... రాబోయే ఐదేళ్లకాలంలో 10 వేల ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో.. 85 శాతం చిన్న, సన్నకారు రైతులను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దాలని జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఎఫ్‌పీఓల ఏర్పాటు కోసం కేంద్రం 4596 కోట్ల రూపాయలు కూడా కేటాయించిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా దాదాపు 145 మిలియన్ వ్యవసాయ యూనిట్లు ఉండగా... అధిక శాతం 2 హెక్టార్ల విస్తీర్ణం కంటే తక్కువగా ఉన్న కమతాలేనని అన్నారు. 300 మంది రైతులతో ఒక ఎఫ్‌పీఓ ఏర్పాటు చేయిస్తే... ఆ సంఘానికి నాబార్డ్ సాయంతోపాటు15 లక్షల రూపాయల ఈక్విటీ రుణం, 2 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే తాము బాపట్ల వద్ద యాజీని అనే గ్రామంలో ఒక ఎఫ్‌పీఓ ఏర్పాటు చేసి పెట్టుబడి ఖర్చులు తగ్గించడమే కాకుండా చక్కటి మార్కెటింగ్ చేసుకుని లాభాలు గడించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ సంఘటన్ కార్యదర్శి దినేష్ దత్తాత్రేయ కులకర్ణి, భారతీయ ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ ఛైర్మన్ డాక్టర్ ఎల్.జలపతిరావు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి జోగినపల్లి శ్రీరంగారావు, పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ