రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు న్యాయస్థానంలో క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి పేర్కొన్నారు. వాళ్లపై ఉన్న కేసులు వీలైనంత తొందరగా విచారించేలా చూడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆయన లేఖ రాశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసి ఏడాది లోపల పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్న.. రాష్ట్రంలో అమలు కావడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసినా... న్యాయమూర్తి, సిబ్బంది నియామకం చేపట్టకపోవడం వల్ల కేసులు పరిష్కారం కావడంలేదని లేఖలో పేర్కొన్నారు.
33 జిల్లాలకుగాను కేవలం 14 జిల్లాల నుంచి 96 కేసులు మాత్రమే ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యాయని పద్మనాభ రెడ్డి తెలిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా కేసులు ఎదుర్కొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో 19 జిల్లాల నుంచి కేసుల బదలాయింపు జరగలేదని సుపరిపాలన వేదిక... గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. ప్రత్యేక న్యాయాధికారి, సిబ్బంది నియామకంతో పాటు బడ్జెట్ కేటాయింపులు జరిపేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. 19 జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలపై ఉన్న కేసులను బదిలీ అయ్యేలా చూడటమే కాకుండా... అన్ని కేసుల విచారణ త్వరితగతిన జరిగేలా చూడాలని సుపరిపాలన వేదిక గవర్నర్‌ను కోరింది.
ఇవీ చూడండి:రైతు సమన్వయ సమితికి ప్రేరణ అదే: కేసీఆర్