హరితహారంలో చక్కటి పనితీరు కనబరిచిన వారిని గణతంత్ర అవార్డులకు పరిగణనలోకి తీసుకుంటామని పీసీసీఎఫ్ శోభ స్పష్టం చేశారు. అడవుల రక్షణ, పునరుజ్జీవనం, పచ్చదనం పెంపు విషయాల్లో క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రోత్సహించేందుకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆమె తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారుల దృశ్యమాధ్యమ సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా ఆరు కేటగిరీల్లో నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందించనున్నారు.
హరితహారం పనితీరు ఆధారం:
హరితహారంలో భాగంగా నర్సరీల నిర్వహణ, పెద్ద మొక్కల పెంపు, మొక్కల సంరక్షణ, అటవీ రక్షణ పద్ధతులు, చక్కటి పునరుజ్జీవన చర్యలు, అడవుల్లో నీటి సంరక్షణ, గడ్డి మైదానాల వృద్ధి, వివిధ వర్గాలను భాగస్వామ్యుల్ని చేయడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని శోభ తెలిపారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే బీట్, సెక్షన్, డిప్యూటీ రేంజ్, ఫారెస్ట్ రేంజ్ అధికారులను ప్రోత్సాహకాల కోసం పరిగణిస్తామన్నారు.
అలసత్వం వహిస్తే చర్యలు:
రానున్న హరితహారం సీజన్ కోసం పెద్ద మొక్కల పెంపకం అన్ని నర్సరీల్లో చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం కనీసం ఒకటిన్నర మీటరు ఎత్తైన మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆమె ఆదేశించారు. కంపా నిధుల కింద చేపట్టిన అటవీ అభివృద్ధి పనుల్లో అలసత్వాన్ని క్షమించేది లేదన్నారు. పనులను థర్డ్ పార్టీ ద్వారా సమీక్షించి నిధుల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే చర్యలకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, ముందస్తు ప్రణాళికలు, వన్యప్రాణుల రక్షణ, నీటి వసతి సౌకర్యాల కల్పన, అటవీ ప్రాంతాల్లో రహదారులు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం అనుమతులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.