పచ్చటి అడవుల్లో అగ్గి రాజుకుంటోంది. ఓ వైపు ఆకులు రాలేకాలం.. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అగ్ని ప్రమాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. నవంబరు-జనవరి మధ్య కాలంలో 289 అగ్ని ప్రమాదాలు జరగగా, ఫిబ్రవరిలో తొలి ఆరు రోజుల్లోనే 306 ఘటనలు జరగడంపై అటవీశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. సాధారణంగా అడవుల్లో అగ్ని ప్రమాదాలు నవంబరు నుంచి మొదలై జులై వరకు కొనసాగుతాయి. ఈ దఫా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ముందస్తుగానే హెచ్చరికలు జారీచేస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు రాష్ట్రంలో 1,231 చోట్ల నిప్పంటుకునే అవకాశం ఉందంటూ అటవీబీట్లు, కంపార్టుమెంట్ల వారీగా సమాచారం పంపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 9,790 అటవీ కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటి ఆధారంగా అటవీశాఖ స్పందిస్తూ చర్యలు తీసుకుంటోంది. శనివారం ఒక్కరోజే(సాయంత్రం 4 గంటల వరకు) వేర్వేరు ప్రాంతాల్లో 64 చోట్ల అడవికి నిప్పంటుకుంది. వీటి కారణంగా 1,082 ఎకరాల అటవీసంపద బుగ్గిపాలైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో, ఆ తర్వాత భధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అడవికి నష్టం జరిగింది.
నిర్లక్ష్యం కారణంగానే..
మనుషుల నిర్లక్ష్యమే ఈ ఘటనలకు కారణమని అటవీశాఖ పేర్కొంటోంది. అటవీ ప్రాంతాల్లో తిరిగేవారు వంట చేసుకుని నిప్పు పూర్తిగా ఆర్పేయకపోవడం, ప్రయాణ సమయంలో తాగిన బీడీ, సిగరెట్లు వంటివి ఆర్పకుండా పారేయడం వల్లనే తాజా ఘటనలు జరిగినట్టు నిర్ధారించింది. కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా మంటలు పెడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
ఇదీ చదవండి: 'బయటి కంటే ఇంట్లోనే మహిళలకు ఎక్కువ హింస'