ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం రాష్ట్రంలో పచ్చదనం పెరిగే దిశగా సాగాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ అన్నారు. ఈ మేరకు ఆమె అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల సమావేశంలో హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్ధేశం చేశారని.. ఆమేరకు ఈ ఏడాది లక్ష్యాలు కూడా పెరిగాయని తెలిపారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పట్టణ ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆరోవిడత హరితహారం లక్ష్యం 20 కోట్ల నుంచి 30 కోట్లకు పెరిగిందని వివరించారు. తాజా లక్ష్యాల ప్రకారం హెచ్ఎండీఏ ఐదు కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ పరిధిలో రెండున్నర కోట్లు, పట్టణ ప్రాంతాల్లో మరో ఐదు కోట్ల మొక్కలను నాటాలని ఆమె తెలిపారు. మొక్కలు నాటే విధానం,వాటికి రక్షణ గార్డులను ఏర్పాటు చేయటం వల్లనే మొక్కల మనుగడ ఆధారపడి ఉంటుందని.. ఆ దిశగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అటవీ శాఖతో పాటు.. మిగతా శాఖల సిబ్బందికి కూడా తగిన విధంగా సాంకేతిక విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి చోట కనీసం ఒక్క ఎకరంలో యాదాద్రి నమునాలో తక్కువ విస్తీర్ణంలో దట్టంగా మొక్కలు నాటడం ద్వారా చిట్టడవుల సృష్టితో పాటు, రక్షణ చర్యలు, మొక్కలు బతికే శాతాన్ని పెంచటం, అటవీ పునరుజ్జీవన చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె తెలిపారు. జిల్లాల వారీగా అటవీ ప్రణాళికలు, రక్షణ చర్యలు, హరితహారం పురోగతి, కొనసాగుతున్న పునరుజ్జీవన పనులతో కూడిన జిల్లా అటవీ విభాగం ప్రొఫైల్ హ్యాండ్‌బుక్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లే నోడల్ అధికారులుగా ఉండి అటవీ పునరుజ్జీవన చర్యలు పర్యవేక్షించాలని అన్నారు. అటవీ అధికారులు కలెక్టర్లతో సమావేశమై జిల్లా స్థాయి సమావేశాల్లో అటవీ రక్షణ చర్యలు, ఇబ్బందులు వివరించాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం కచ్చితంగా అమలు కావాలని స్పష్టం చేశారు. అటవీ బ్లాకుల్లో పునరుజ్జీవన చర్యలకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రాధాన్యత ఇస్తోందని... హరితహారంలో భాగంగా ఈ పనులు కొనసాగుతాయని పీసీసీఎఫ్ అధికారి శోభ తెలిపారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్