విదేశీ విద్యార్థులకు హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) గమ్యస్థానంగా మారుతోంది. 2021-22 విద్యా సంవత్సరంలో 1512 మంది వర్సిటీలో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్లలో 5 రెట్లు అత్యధికంగా దరఖాస్తులు అందినట్లు వర్సిటీ తెలిపింది. అవి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రీసెర్చి(ఐసీసీఆర్) కింద వర్సిటీకి అందాయి. మరో 45 మంది నేరుగా అర్జీలు పంపారు. హెచ్‌సీయూకు 2019లో కేంద్ర ప్రభుత్వ విశిష్ఠ హోదా దక్కింది. విదేశీ విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్, నేచర్ ఇండెక్స్‌లో మంచి ర్యాంకులు రావడమూ కలిసొచ్చింది.
ఏయే దేశాల నుంచి.. సిరియా, యెమెన్, ఉగాండా, నైజీరియా, బంగ్లాదేశ్, సూడాన్, జోర్డాన్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, మారిషస్, నేపాల్, టాంజానియా, శ్రీలంక, మలావి, ఇండోనేసియా, స్వాజిల్యాండ్, ఇరాక్, బోట్స్‌వానా, ఇరిత్రియా దేశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీసీ ప్రొ.బీజే రావు, విదేశీ వ్యవహారాల సంచాలకుడు ప్రొ.ఎన్.శివకుమార్ మాట్లాడుతూ.. ఐసీసీఆర్ కింద వచ్చిన అర్జీలను పరిశీలించి 129 మందిని ఎంపిక చేయగా 31 మంది ప్రవేశం తీసుకున్నారన్నారు.
రెండు హాస్టళ్ల నిర్మాణం.. వర్సిటీకి చెందిన ఆచార్యుల బృందం.. రానున్న మూడేళ్లకు హార్మోని పేరిట యూరోపియన్ కమిషన్ అందించే గ్రాంటు దక్కించుకుంది. ఆసియా దేశాల్లో ఉన్నత విద్యలో విదేశీ విద్యార్థుల భాగస్వామ్యం పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం నిధులు ఖర్చు చేయాలి. అలాగే విదేశీ విద్యార్థుల కోసం 50 వ్యక్తిగత గదులతో కూడిన ప్రత్యేక హాస్టల్‌ను కేటాయించింది. మరో రెండు వసతి గృహాలు నిర్మాణంలో ఉన్నాయి.
ఇదీ చూడండి: ఈ ఏడు టిప్స్‌తో మీ నెట్ బ్యాంకింగ్ సేఫ్!