medical courses in telangana తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఆ క్రమంలోనే రాష్ట్రంలో తొలిసారి వైద్యవిద్య అనుబంధ కోర్సులను ప్రవేశపెట్టింది. 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 12 రకాల కోర్సులు, 860 బీఎస్సీ పారామెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ జీవో నెంబర్ 156ను విడుదల చేసింది.
గాంధీ, కాకతీయ, రిమ్స్, ఉస్మానియా, నిజామాబాద్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే వీటిని ప్రారంభించనునట్టు సర్కారు పేర్కొంది. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్క్యూలార్ టెక్నాలజీ కోర్సులకు సంబంధించి పారా మెడికల్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. తాజా నిర్ణయం వల్ల ప్రతి సంవత్సరం 860 మంది లబ్ధి పొందుతారని... తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నాయని సర్కారు పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల సీఎం కేసీఆర్... 8 నూతన వైద్య కళాశాలలను ఏకకాలంలో వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండం వైద్య కళాశాలల్లో 2022-23 వైద్యవిద్య సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమైనట్లు అయింది. వీటి ద్వారా 1,150 సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో వైద్యవిద్య కళాశాలల సంఖ్య 17కి చేరింది.
ఇవీ చూడండి: