ధరలు మండిపోతున్నా సరే...!
నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌కు వినియోగదారులు పోటెత్తారు. ఎంజే మార్కెట్, జాంభాగ్, కొత్తపేట మార్కెట్లతోపాటు అన్ని రైతుబజార్ల వద్ద పూల విక్రయాలు జోరుగా సాగుతోన్నాయి. లక్ష్మీదేవి పూజలకు, దుకాణాలను అందంగా అలంకరించేందుకు పూల తోరణాలు, గుమ్మడి కాయలు, ప్రమిదలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. ధరలు అధికమైనా కూడా పూలు కొనడం తప్పడం లేదని వినియోగదారులు చెబుతున్నారు.
ఆగం చేసిన అకాలవర్షాలు...
రాష్ట్రంలో కురిసి వర్షాలకు పూల పంటలు దెబ్బతినటమే కాకుండా... ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్‌లో మంచి ధరలు ఉన్నప్పటికీ... సరైన దిగుబడులు లేక కొందరు రైతులు సతమతమతున్నారు. సొంతంగా మార్కెట్‌కు తెచ్చి అమ్ముకున్న మరొకొందరు రైతులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వెలుగుతున్న ప్రమిదల వ్యాపారం
దీపాల పండుగ వేళ మార్కెట్లలో ప్రమిదల వ్యాపారం కూడా జోరందుకుంది. 12 ప్రమిదలను రూ.25 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. రకరకాల ఆకారాల్లో ఉన్న ప్రమిదలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోల్చితే ఈసారి కొనుగోలు తక్కువగానే ఉన్నా... మొత్తంగా చూస్తే లాభసాటిగానే ఉందని వ్యాపారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక మాంద్యం ప్రభావమూ... విపణిపై ఉండటం వల్ల పండుగకు సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. అధిక ధరలతో ఈ దీపావళి ఖరీదైన పండుగగా మారిందని ప్రజలు వాపోతున్నారు.
ఇవీ చూడండి: హుజూర్నగర్ నియోజకవర్గంపై కేసీఆర్ వరాల జల్లు